Begin typing your search above and press return to search.

రాజీవ్ ప్ర‌స్తావ‌న... మోదీకి దెబ్బేసిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   10 May 2019 4:41 PM GMT
రాజీవ్ ప్ర‌స్తావ‌న... మోదీకి దెబ్బేసిన‌ట్టేనా?
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా బీజేపీ - కాంగ్రెస్ ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. చౌకీదార్ నంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఎద్దేవా చేసి ఇరుక్కుంటే... ఇప్పుడు రాహుల్ నే కాకుండా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఇమేజీని డ్యామేజీ చేసేందుకు దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్య‌లు బీజేపీకి దెబ్బ కొట్టేశాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగ‌గా... రాహుల్ గాంధీ ఏకంగా సుప్రీంకోర్టుకు సారీ చెప్పాల్సి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా రాజీవ్ గాంధీపై మోదీ చేసిన జ‌ల్సా వ్యాఖ్య‌ల‌తో బీజేపీకి దెబ్బ ప‌డిపోయింద‌ని చెప్పాలి.

రాజీవ్ ప్ర‌ధానిగా ఉండ‌గా... 1987లో ఐఎన్ ఎస్ విరాట్ పై త‌న స‌తీమ‌ణి సోనియా గాంధీ - ఆమె సోద‌రుల‌తో క‌లిసి చేశారంటూ మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానిగా ఉండి దేశ ర‌క్ష‌ణ‌లో కీల‌క భూమిక పోషిస్తున్న విరాట్ నౌక‌ను త‌న జ‌ల్సాల‌కు వినియోగించార‌ని మోదీ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు నాడు ఏం జ‌రిగింద‌న్న విష‌యంపై ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఎదురు దాడి మొద‌లెడితే... మ‌రోవైపు భార‌త నావికా ద‌ళంలో నాడు కీల‌క ప‌ద‌వుల్లో ఉండి ఇప్పుడు రిటైర్ అయిపోయిన ప‌లువురు నేవీ మాజీ అధికారులు కూడా మోదీ వ్యాఖ్య‌ల‌పై త‌మ‌దైన శైలి వివ‌ర‌ణ‌లు ఇస్తూ బీజేపీని ఇర‌కాటంలోకి నెట్టేశారు.

రాజీవ్ ప్ర‌ధానిగా ఉండ‌గా... ఐఎన్ ఎస్ విరాట్ లో విహ‌రించిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని - అయితే ఈ విష‌యంలో రాజీవ్ అధికార దుర్వినియోగానికి మాత్రం పాల్ప‌డ‌లేద‌ని, త‌న ప‌ర్య‌ట‌న‌లో ప్రొటోకాల్ నిబంధ‌న‌ల‌ను రాజీవ్ ప‌క్కాగానే పాటించార‌ని నేవీ మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. అస‌లు రాజీవ్ ప్ర‌ధానిగా ఉండ‌గా ఏనాడూ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని - అస‌లు రాజీవ్ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డ దాఖ‌లాలే లేవ‌న్న క‌థ‌నాలు పెద్ద ఎత్తున వ‌చ్చి ప‌డుతుండ‌టంతో మోదీ వ్యాఖ్య‌లు బీజేపీని ఇర‌కాటంలోనే ప‌డేశాయ‌ని చెప్పాలి. అయినా క‌ళ్ల ముందున్న ప్ర‌త్య‌ర్థుల‌ను వ‌దిలేసి... ఎప్పుడో మ‌ర‌ణించిన రాజీవ్ గాంధీ ప్ర‌స్తావ‌న‌ను మోదీ అన‌వ‌స‌రంగా తీసుకొచ్చార‌ని మోదీపై సొంత పార్టీ నేత‌లు రుస‌రుస‌లాడుతున్న ప‌రిస్థితి. మొత్తంగా రాజీవ్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన మోదీ అన‌వస‌రంగానే పెను వివాదంలో ఇరుక్కుపోయార‌న్న వాద‌న ఇప్పుడు బ‌లంగానే వినిపిస్తోంది.