Begin typing your search above and press return to search.

ఆ 95 మరణాలు మోడీ వల్లే

By:  Tupaki Desk   |   12 Dec 2016 11:42 AM GMT
ఆ 95 మరణాలు మోడీ వల్లే
X
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఆమె సోషల్ మీడియా వేదికగా మోడీని ఎండగట్టారు. 'మోడీ బాబూ... మీ పుణ్యమా అని ఇంకెంతమంది ప్రాణాలు కొల్పోవాలి?' అంటూ ఆమె ట్విట్టర్ లో ప్రశ్నించారు. దీనిని ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ రీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పెద్ద నోట్ల రద్దు అనంతరం క్యూ లైన్లలో నిల్చుని, ఇతర నగదు ఇబ్బందుల వల్ల సుమారు 95 మంది మృతి చెందారని ఆయన ఆరోపించారు. తృణమూల్ అభిమానులు మమత, డెరెక్ ల ట్వీట్లను తెగ షేర్ చేస్తున్నారు.

కాగా బీజేపీ పశ్చిమ్‌ బంగ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ మమతా బెనర్జీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. తమ పార్టీ అధినేత గురించి గూండాల తరహా భాష వాడారని ఆరోపిస్తూ, తాము దాన్ని తేలిగ్గా తీసుకోబోవడం లేదన్నారు. పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ మమతా బెనర్జీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని, ఆమెను ఎవరూ ఆపలేరని తృణమూల్ నేతలు సవాల్ చేస్తున్నారు.

మమతా బెనర్జీ మతిస్థిమితం కోల్పోయారని ఘోష్ అన్న సంగతి తెలిసిందే. ఆమెకు ఏంచేయాలో తెలియక సెక్రెటేరియట్‌లో ఉండిపోతున్నారని... ఆమె గంగలో దూకుతారేమోనని కూడా అనుకున్నామని ఘోష్ అన్నారు. ఇటీవల ఆయన ఇంకో సమావేశంలో మాట్లాడుతూ ‘మమత ఢిల్లీ వెళ్లి అక్కడ హడావుడి చేశారు.. ఢిల్లీలో ఉన్నదెవరు? మేమే.. తలచుకుంటే ఆమెను జుత్తు పట్టుకుని ఈడ్చి అవతల పడేసేవాళ్లం... కానీ అలా చేయలేదు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ నేతలు ఆ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.