Begin typing your search above and press return to search.

మోడీ సర్కారు కీలక నిర్ణయం.. ఆర్టికల్ 360 అంటే?

By:  Tupaki Desk   |   24 March 2020 5:16 AM GMT
మోడీ సర్కారు కీలక నిర్ణయం.. ఆర్టికల్ 360 అంటే?
X
పిశాచి వైరస్ కరోనాను కంట్రోల్ చేసేందుకు వీలుగా దేశ ప్రధాని మోడీ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటిస్తారా? తాను పిలుపు ఇచ్చినంతనే యావత్ దేశం కదిలి ఆదివారం వేళ జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటించిన తీరుతో సంతోషపడ్డ ప్రధానికి.. సోమవారం నాటి పరిణామాలు చూసి వేదన చెందారు. దీంతో.. అప్పటివరకూ ఆయనలో ఉన్న ఉత్సాహం కాస్తా ఆవిరి కావటమే కాదు.. ఆగ్రహంతో కఠిన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలున్న ప్రాంతాల్లో సోమవారం ఉదయం ప్రజలు పోటెత్తిన తీరుతో షాక్ తిన్నట్లుగా ఆయన మాటల్ని చూస్తే అర్థం కాక మానదు.

కఠిన చర్యలు తీసుకోకుంటే పరిస్థితిని కంట్రోల్ చేయటం కష్టమన్న నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా కరోనా ఆంక్షలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీదకు వస్తే.. కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం మొత్తంగా ఒకేలాంటి నిర్ణయాలు తీసుకోవటంతో పాటు.. వైరస్ ధాటికి అతలాకుతలం అవుతున్న దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు వీలుగా సంచలన నిర్ణయాన్ని తీసుకోవాలని భావిస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

ఇప్పటివరకూ ప్రధాని మోడీతో సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలు..కీలక అధికారుల నోటి నుంచి దేశంలో ఆర్టికల్ 360 అమలుకు సంబంధించి ఎలాంటి సంకేతాలు రాకున్నా.. హటాత్తుగా దీన్ని అమల్లోకి తెచ్చే అవకాశం ఉందంటున్నారు. దేశానికి హితం చేస్తుందంటే చాటు.. ఎంతటి సంచలన నిర్ణయానికికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించే మోడీ.. ఒకసారి ఫిక్స్ అయితే.. దేశంలో అత్యయిక పరిస్థితిని విధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

ఈ వాదనకు బలం చేకూరేలా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి ఒక ట్వీట్ చేస్తూ.. ఇక ఇప్పుడు దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించటం అనివార్యమా? అన్న క్వశ్చన్ వేయటమే కాదు.. ఈ సందేహం మీద సమాధానం ఇవ్వాలన్న ఆయన ట్వీట్ కొత్త చర్చకు తెర తీసింది. కరోనా విస్తరించటం ఒక ఎత్తు అయితే.. అంతకంతకూ కుంగిపోతున్న షేర్ మార్కెట్లు.. రూపాయి పతనం వేళ.. పరిస్థితిని కంట్రోల్ లో ఉంచేందుకు వీలుగా.. ఆర్థిక ఎమర్జెన్సీని విధించటం అనివార్యమా? అన్నది ప్రశ్నగా మారింది.

ఇంతకీ ఆర్టికల్ 360 అంటే ఏమిటి? దాంతో ఎలాంటి పరిణామాలుచోటు చేసుకుంటాయి? అన్నది చూస్తే.. దేశాన్ని పాలించేందుకు రాష్ట్రపతికి అన్ని అధికారాల్ని అప్పజెప్పటమే ఆర్టికల్ 360 ఉద్దేశంగా చెప్పాలి. రాజ్యాంగంలోని ఈ అధికరణను ఒకసారి దేశంలో అమలు చేయాలన్న నిర్ణయం తీసుకున్నంతనే.. పలు కీలక మార్పులు చోటు చేసుకుంటాయి.

ఆ వెంటనే రాష్ట్రాలు తమ ఆర్థిక వనరుల్ని ఎలా వినియోగించుకోవాలో చెప్పే అధికారం కేంద్రానికి దఖలు పడుతుంది. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సవరించే అవకాశం రాష్ట్రపతికే ఉంటుంది. ఒకవేళ ఆర్టికల్ 360ను విధిస్తూ రాష్ట్రపతి దీన్ని తీసుకొస్తే.. రెండు నెలల వరకూ కొనసాగించే వీలు ఉంటుంది. ఆ తర్వాత కూడా కొనసాగించాలంటే మాత్రం.. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశ పెట్టి ఆమోదించుకోవాల్సి ఉంటుంది. మరింత సంచలన నిర్ణయం మోడీ ప్రభుత్వం తీసుకుంటుందా? అన్నది అసలు ప్రశ్న.