Begin typing your search above and press return to search.

మోదీకే స‌ల‌హాలిచ్చి.. న‌డిపిస్తున్నార‌న‌ట‌!

By:  Tupaki Desk   |   24 Sep 2017 10:48 AM GMT
మోదీకే స‌ల‌హాలిచ్చి.. న‌డిపిస్తున్నార‌న‌ట‌!
X
ప్ర‌ధానిగా బాధ్య‌తలు చేప‌ట్టిన గుజ‌రాత్ మాజీ సీఎం న‌రేంద్ర దామోద‌ర్‌ దాస్ మోదీ... త‌న వినూత్న ఆలోచ‌నా ప్ర‌క్రియ‌ల‌తో ముందుకు పోయిన, పోతున్న విష‌యం తెలిసిందే క‌దా. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2014 సెప్టెంబరులో మ‌న్‌ కీ బాత్‌(మ‌న‌సులో మాట‌) పేరుతో ఓ వినూత్న రేడియో కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ప్ర‌తి ఆదివారం లేదా కుదిరిన ఆదివారం రోజున ఆయ‌న త‌న మ‌నోభావాల‌ను రేడియో మాధ్య‌మం ద్వారా ప్ర‌జ‌ల‌తో పంచుకునేవారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ప్ర‌జ‌ల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు సైతం ఆహ్వానించారు. అయితే, తాజాగా ఈ రోజు ఆదివారంతో ఈ కార్య‌క్ర‌మానికి మూడేళ్లు పూర్త‌య్యాయి.

ఈ సంద‌ర్భంగా ఈ విష‌యం లేవ‌నెత్తిన ప్ర‌ధాని ఈ మూడేళ్ల కాలంలో త‌న‌ను న‌డిపించింది కేవ‌లం ప్ర‌జ‌లు ఇచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌లేన‌ని చెప్పారు. దేశ ప్రజలతో అనుసంధానం అయ్యేందుకు, వారి మనోభావాలను తెలుసుకునేందుకు 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమం వేదికగా ఉపయోగపడిందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశమంతా ఒక సందర్శకుడిలా కాకుండా ఒక విద్యార్థిలా పర్యటించి.. దేశాన్ని అర్థం చేసుకోవాలని ప్ర‌జ‌ల‌కు సూచించారు. 'స్వచ్ఛత' రాయబారిగా శ్రీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నుకున్న 18 ఏళ్ల యువకుడు బిలాల్‌ దర్‌ను ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

అదేవిధంగా జవానులైన తమ భర్తలు వీరమరణం పొందిన అనంతరం భారత సైన్యంలో చేరిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ స్వాతి మహదిక్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ నిధి దుబేలను ప్రధాని మోదీ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. వారు దేశానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలే కేంద్రంగా 'మన్‌ కీబాత్‌' కార్యక్రమంలో తాను మాట్లాడుతున్నాన‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్రజల పట్ల మరింత సున్నితంగా వ్యవహరించడానికి వీలు కలిగిందని తెలిపారు. స్వ‌చ్ఛ‌తే సేవ‌ కార్యక్రమానికి భారీ మద్దతు లభిస్తుండటంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి రాజ‌కీయాల‌కు అతీతంగా తాను సేవ చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చిన మోదీ.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు మ‌న్‌కీబాత్ బాగానే ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.