Begin typing your search above and press return to search.

డ‌బ్బులు ఖ‌ర్చు చేసే ప‌నులే చెబుతున్న మోడీ

By:  Tupaki Desk   |   25 Sep 2017 4:56 AM GMT
డ‌బ్బులు ఖ‌ర్చు చేసే ప‌నులే చెబుతున్న మోడీ
X
ప‌లుకే బంగార‌మా? అన్న‌ట్లుగా ప‌దేళ్ల పాటు దేశ ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించిన మ‌న్మోహ‌న్ సింగ్ తీరు ఉండేది. ఆయ‌న్ను ముద్దుగా కొంద‌రు మౌన‌సింగ్ అనేవారు. ఆయ‌న త‌ర్వాత ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న న‌రేంద్ర‌మోడీ అందుకు భిన్నంగా అదేప‌నిగా మాట్లాడుతూ ఉంటారు. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి చాలానే కార్య‌క్ర‌మాల్ని షురూ చేసిన మోడీ.. నిత్యం దేశ ప్ర‌జ‌ల‌కు ఏదో ఒక‌టి చెప్ప‌టం.. మ‌రేదో ఒక‌టి చేయిస్తూ క‌నిపిస్తారు.

మ‌న్ కీ బాత్ పేరిట రేడియోలో మాట్లాడి.. దేశ ప్ర‌జ‌ల‌కు నిత్యం ట‌చ్ లో ఉంటున్నారు. స్ఫూర్తివంత‌మైన నాలుగు మాట‌లు చెప్పే మోడీ పుణ్య‌మా అని ఇప్ప‌టికే ప‌లువురు ఫేమ‌స్ అయ్యారు. తాజాగా మ‌రోసారి మ‌న్ కీ బాత్ పేరిట రేడియోలో మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టి మూడేళ్లు అవుతున్న నేప‌థ్యంలో త‌న 36వ ప్ర‌సంగాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం త‌న‌ది కాద‌ని.. దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్ర‌జ‌లు త‌న‌కు స‌మాచారం అందిస్తాన‌ని.. ఆ మాట‌లే తాను చెబుతాన‌ని వెల్ల‌డించారు.

ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర కావ‌టానికి.. వారి స్పంద‌న‌లు.. ఆశ‌లు.. ఆకాంక్ష‌లు.. కంప్లైట్స్ తెలుసుకోవ‌టానికి ఇదో చ‌క్క‌టి వేదిక‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. త‌న‌కు దేశ వ్యాప్తంగా చాలా అంశాలు వ‌స్తున్నాయ‌ని.. వాటిల్లో కొన్నింటి మాత్ర‌మే తాను పంచుకుంటున్నాన‌న్నారు. మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం ద్వారా ల‌బ్థి చేకూరుతుంద‌న్న ఆశ‌ను వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం న‌డుస్తున్న ద‌స‌రా సెల‌వుల్ని పుర‌స్క‌రించుకొని మోడీ స‌రికొత్త మాట‌ను చెప్పారు.

భిన్న‌త్వంలో ఏక‌త్వ‌మే భార‌త్ గొప్ప‌త‌న‌మ‌ని గ‌ర్వ‌ప‌డుతుంటామ‌ని.. ఆ భిన్న‌త్వాన్ని అస్వాదించాలని చెబుతూ.. ఈ సెల‌వుల్లో టూర్లు వేయాల‌ని కోరారు. సెల‌వుల్ని వినియోగించుకోవాల‌ని యువ మిత్రుల్ని కోరుతున్న‌ట్లుగా చెప్పిన మోడీ.. అలా టూర్‌కు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత త‌మ ఫోటోల్ని ఇన్ క్రెడిబుల్ ఇండియా.. మైగ‌వ్ యాప్ లో పెట్టాల‌ని.. త‌మ అనుభ‌వాల‌ను పంచుకోవాల‌న్నారు. ఫారిన్ టూర్ల‌కు వెళ్లినా త‌న‌కు అభ్యంత‌రం లేద‌న్నారు.

సెల‌వుల్లో టూర్ల‌కు వెళ్లాల‌న్న బ్ర‌హ్మాండ‌మైన ఐడియా ఇచ్చిన మోడీ.. అక్టోబ‌రు మాసంలో ఖాదీని వాడ‌మ‌న్నారు. ఖాదీ అంటే కేవ‌లం వ‌స్త్రాలు మాత్ర‌మే కాద‌ని.. అదో భావ‌న అని.. అదో సిద్ధాంత‌మ‌న్నారు. ఎప్పుడూ ఖాదీనే ధ‌రించాల‌ని తాను కోరుకోవ‌టం లేద‌ని.. కానీ అనేక వ‌స్త్రాల్లో ఖాదీని ఒక‌టిగా చేసుకోవాల‌న్నారు.

మోడీ మాట‌ల్ని చూస్తే.. అన్ని కూడా జేబులో నుంచి రూపాయి తీసి ఖ‌ర్చు చేయించేలా ఉంటాయే త‌ప్పించి.. రూపాయి దాచి పెట్టేలా ఉండ‌వు. మ‌రి.. జ‌నాల్ని ఖ‌ర్చు చేయాల‌న్న‌ట్లుగా ముద్దు ముద్దుగా మాట్లాడే మోడీ.. సెల‌వుల సంద‌ర్భంగా దేశంలోని విద్యార్థులకు బ‌స్సులు.. రైళ్ల‌ల్లో యాభై శాత‌మో.. 75 శాతం రాయితీతో ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని ఎందుకు స‌మ‌కూర్చ‌రు? ఎప్పుడూ జ‌నాల నెత్తి మీద ఏదో రకంగా భారాలు మోపే మోడీ.. అదే ప్ర‌జ‌ల‌కు తాయిలాలు ఎందుకు ఇవ్వ‌రు? పెరిగిన నిత్య‌వ‌స‌రాలు.. పెట్రోల్ ధ‌ర‌లతో సామాన్యుడి బ‌డ్జెట్ అంత‌కంత‌కూ మారిపోతున్న వేళ‌.. స్కూలు.. కాలేజీ విద్యార్థులు భిన్న‌త్వంలో ఏక‌త్వం తెలుసుకోవ‌టం కోసం ప‌ర్య‌ట‌న‌లు చేయ‌మ‌న‌టం బాగానే ఉంది.కానీ.. ఇందుకు అవ‌స‌ర‌మైయ్యే ఖ‌ర్చును ఎవ‌రు భ‌రిస్తారు? త‌ల్లిదండ్రుల మీద మ‌రింత భారాన్ని మోపే స‌ల‌హాలు ఇచ్చే క‌న్నా.. వారికి ద‌న్నుగా నిలిచే పెద్ద‌న్న మాదిరి ఎందుకు వ్య‌వ‌హ‌రించ‌రు?