అమ్మ గురువును కూడా ఫిదా చేసిన మోడీ
By: Tupaki Desk | 7 Aug 2015 4:51 PM GMTప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ పక్కన పెట్టి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇల్లు పోయిస్ గార్డెన్ లో విందుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. చేనేత దినోత్సవం సందర్భంగా సేలం పంచెలకు బ్రాండ్ గుర్తింపు కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు అనంతరం జయలలితను కలిసేందుకు ప్రధాని ఆమె ఇంటికి వెళ్లారు. ఈ విందు రాజకీయం రాజకీయ శక్తుల పునరేకీకరణకు దారితీస్తుందా అన్న అంశంపైనే చర్చ సాగుతుంటే దీనికి కొనసాగింపుగా మోడీ మరో అడుగు వేశారు.
బీజేపీ- ఏఐఏడీఎంకే పార్టీల మధ్య ఈ మధ్య సంబంధాలు కాస్త మెరుగయ్యాయి. ఏఐఏడిఎంకెకు చెందిన ఎంపీ తంబిదురైను లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేసిన తర్వాత క్రమంగా సంబంధాలు మెరుగుపడ్డాయి. తాజాగా మోడీ జయలలిత ఇంటికి వెళ్లడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.ప్రధాని మోదీ, జయలలిత మధ్య విందు రాజకీయం 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయపార్టీలు తిరిగి కలిసి పోటీ చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. రాజ్యసభలో ఎన్డీఏకు తగిన సంఖ్యాబలం లేదు. రాజ్యసభలో కేంద్రప్రభుత్వం బిల్లులు గట్టెక్కించుకోవాలంటే.. ఏఐఏడీఎంకె సాయం కూడా అవసరం. దీంతో పాటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అడుగులు పడుతున్నట్లు సమాచారం.
శ్వాసకోశ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న ప్రముఖ తమిళ వార పత్రిక ‘తుగ్లక్’ ఎడిటర్ చో రామస్వామిని ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించారు. జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం చెన్నై వెళ్లిన మోడీ చో రామస్వామి అనారోగ్యం గురించి తెలుసుకుని ఆయన నివాసంలో కలుసుకుని పరామర్శించారు. మోడీ రాకతో రామస్వామి కూడా ఫిదా అయ్యారట.
చో రామస్వామి జయలలితకు రాజకీయ గురువు. జయ కీలక నిర్ణయాలన్నింటిలోనూ ఆయన పాత్ర ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు వైపుల నుంచి నరుక్కువచ్చేందుకు మోడీ ఈ విధంగా ఎత్తులు వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.