Begin typing your search above and press return to search.

ఆంధ్రోడు అంతమాత్రానికి పనికి రాడా మోడీ.?

By:  Tupaki Desk   |   27 Oct 2015 4:50 AM GMT
ఆంధ్రోడు అంతమాత్రానికి పనికి రాడా మోడీ.?
X
ఎవరైనా ఇంట్లో జరిగే శుభకార్యానికి మిమ్మల్ని అతిధిగా పిలిస్తే ఏం చేస్తారు? మీ స్థాయికి తగిన బహుమతి తీసుకుంటారు. లేదంటే.. పిలిచిన వారితో మీకున్న అనుబంధానికి తగినట్లుగా బహుమతి తీసుకుంటారు. మొత్తంగా కాస్త ఎక్కువో..తక్కువో బహుమతి మాత్రం వెంట తీసుకెళ్లటం మాత్రం ఖాయం. అయితే.. ఈ విధానానికి భిన్నంగా ఆలోచించే వారూ ఉంటారు కానీ.. వారు చాలా తక్కువని చెప్పాలి.

వ్యక్తిగతంగా పిలిచే శుభకార్యానికే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఒక రాష్ట్ర రాజధాని శంకుస్థాపనకు అత్యుత్తమ స్థానంలో ఉన్న వారిని పిలిస్తే..? వారు ఎలా స్పందిస్తారు? కచ్ఛితంగా ఆ రాష్ట్ర ప్రజల్ని సంతోష పెట్టేలా ఏదో ఒక హామీ ఇవ్వటం మామూలు. ఇలాంటి సహజమైన ఆశను వ్యక్తం చేశారు సీమాంధ్రులు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీ ఆహ్వానించినప్పుడు చాలామంది చాలానే ఆశలు పెట్టుకున్నారు. మోడీ కచ్ఛితంగా ఏదో ఒక వరం ప్రకటిస్తారని భావించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారన్న ఆశ లేకున్నా.. ప్రత్యేక ప్యాకేజీ అయినా ప్రస్తావించి సీమాంధ్రులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఓ తీపి గురుతుగా మిగులుస్తారని భావించారు. కానీ.. పార్లమెంటు పుట్టమట్టి.. యమునా నీటిని తీసుకొచ్చి.. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల్లో పెట్టి.. అమరావతి నిర్మాణంలో తాను కూడా భాగస్వామిని అవుతానని చెప్పేసి వెళ్లిపోయారు. మోడీ వ్యవహారశైలి చాలామందికి అగ్రహం కలిగించింది. ఎందుకలా అంటే.. మోడీ మీద ఆశలు పెట్టుకోవటమే కారణం. ఒక చారిత్రక కార్యక్రమానికి వస్తున్న మోడీ.. దాదాపు 5 కోట్ల మంది సీమాంధ్రుల ఆకాంక్షల గురించి ఆలోచించి ఉండరా? అన్న ప్రశ్న వేసుకొని ఉంటే.. కచ్ఛితంగా వేసుకొని ఉంటారు.

కాకుంటే.. ప్రస్తుతం ఆయనిచ్చే వరాల కారణంగా లాభం కంటే నష్టమే ఎక్కువని అనిపించి ఉండొచ్చు. అదే ఏపీకి ఎలాంటి వరం రాకుండా చేసిందన్న భావన వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. వరాలు ఇవ్వటం మోడీకి కొత్త విషయం ఏమీ కాదు. ఆయన ఇవ్వాలని అనుకుంటే.. ముందు వెనుకా చూసుకోకుండా ఇచ్చే వైనం జమ్మూకశ్మీర్.. బీహార్ రాష్ట్రాల్లో ఇప్పటికే చోటు చేసుకుంది. ఆయా రాష్ట్ర ప్రజల్ని తన వరాలతో మురిపించి.. మరపించిన మోడీ ఏపీ ప్రజల విషయంలో ఎందుకు పట్టనట్లు ఉన్నారన్న విషయాన్ని చూస్తే.. సమీప భవిష్యత్తులో ఏపీలో ఎన్నికలు లేకపోవటంగానే కనిపించక మానదు.

తన దగ్గరికి వచ్చిన వారికి కానీ.. తాను వెళ్లిన ఏ కార్యక్రమానికి కానీ ఉత్త చేతులతో మోడీ వెళ్లటం కనిపించదు. విదేశీ పర్యటనల సందర్భంగా.. ఆయా దేశాలకు సంబంధించి అత్యంత ఆసక్తికర విషయాలను ముందుగా గుర్తించి.. వాటిని బహుమతిగా తీసుకెళ్లటం మర్చిపోలేం. తాజాగా గీత ఉదంతమే చూద్దాం. దాదాపు 15 ఏళ్ల క్రితం భారత్ నుంచి తప్పిపోయి పాకిస్థాన్ కు చేరిన చిన్నారి.. ఇప్పుడు పెద్దదై.. భజరంగీ భాయిజాన్ సినిమా పుణ్యమా అని సోమవారం దేశానికి తిరిగి వచ్చింది. ఆమెకు సాదర స్వాగతం పలికారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భేటీ అయ్యారు. గీతతో.. ప్రధాని మోడీ సైతం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెను గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన ఆయన.. ఆమె బాగోగుల్ని యావత్ దేశం తీసుకుంటుందన్న భరోసాను ఇచ్చేశారు.

అంతేకాదు.. గీతకు ఇంతకాలం ఆశ్రయం ఇచ్చిన ఈధీ ఫ్యామిలీ ఫౌండేషన్ కు థ్యాంక్స్ చెప్పిన ఆయన.. ఆ సంస్థ కు రూ.కోటి విరాళం ప్రకటించారు. పాకిస్థాన్ లోని ఒక స్వచ్చంద సంస్థకు రూ.కోటి విరాళం ఇవ్వటం చూసినప్పుడు.. పాక్ లోని స్వచ్చంద సంస్థ పాటికి సీమాంధ్రుడు రాడా అనిపించక మానదు. మనమ్మాయి దారి తప్పి దేశం కాని దేశం చేరితే పెద్ద మనసుతో చేరదీసి పెంచి పెద్ద చేసిన సంస్థకు ఇచ్చే రూ.కోటి మొత్తం చిన్నదే. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారణంగా తాను మొత్తంగా నష్టపోయిన ఏపీ గురించి.. అక్కడి ప్రజల గురించి మోడీకి ఎందుకు పట్టదన్నదే ప్రశ్న.

ఇక్కడ ఈధ్ సంస్థకు విరాళం ఇవ్వటం తప్పని చెప్పటం లేదు. సాయం చేసే తత్వం మోడీకి ఉంది. కానీ.. సీమాంధ్రుడికి చేయూత ఇచ్చే ఉద్దేశ్యమే ఆయనకు లేదన్నది ఇక్కడ పాయింట్. పాక్ కు చెందిన ఒక ఎన్జీవో మీద ప్రదర్శించిన కరుణ మాత్రమే కాదు.. సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న భూకంపం కారణంగా పాక్.. అఫ్ఘనిస్తాన్ చిగురుటాకులా వణికిపోతే.. ఏమైనా సాయం కావాలా? అని వెనువెంటనే స్పందించిన మోడీ.. సీమాంధ్రుడి సమస్యల మీద.. వారి డిమాండ్ల మీద ఎందుకని స్పందించటం లేదు? పట్టనట్లు ఎందుకుంటున్నారు? ఇంతకీ.. సీమాంధ్రుడి మీద మోడీకి అంత మంట ఏల..?