Begin typing your search above and press return to search.

తనను తిట్టిపోసే విపక్షాల వద్దకు మోడీ వెళ్లి..

By:  Tupaki Desk   |   17 Nov 2016 3:51 AM GMT
తనను తిట్టిపోసే విపక్షాల వద్దకు మోడీ వెళ్లి..
X
నేటికి ఐదు రోజుల క్రితం.. నిన్నటికి నాలుగు రోజుల క్రితం జరిగిన ఒక ఘటనను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివారం తన గోవా పర్యటనలో ప్రసంగించిన ప్రధాని మోడీ ఒక దశలో తీవ్ర భావోద్వేగానికి గురి కావటమే కాదు.. ఒక దశలో ఆయన కంట కన్నీటి పొర స్పష్టంగా కనిపించిన వైనం చాలామందిలో విస్మయానికి గురి చేసింది. తన వైఖరితో ఎదుటోళ్లకు చుక్కలు చూపించే తత్వం ఉన్న ప్రధాని మోడీ కంట కన్నీటి పొరా? అని పలువురు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇది గడిచిన నాలుగు రోజుల తర్వాత (నిన్నటికి) పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా మోడీ తీరు ఎలా ఉంటుంది? ఆయన బాడీ లాంగ్వేజ్ పై ఆసక్తి వ్యక్తమైంది. కొందరి అంచనాల్ని తప్పు చేస్తూ మోడీ భిన్నంగా వ్యవహరించారు. ఇంటా బయటా.. తాను తీసుకున్న పెద్ద నోట్ల రద్దుపై బహిరంగంగా కొందరు.. లోగుట్టుగా మరికొందరు విరుచుకుపడుతున్న వేళ.. ఆయన చాలా ఉల్లాసంగా కనిపించారు. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో కనిపించిన ఆయన.. అందుకు తగ్గట్లే జోకులు వేయటం గమనార్హం.

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావటానికి పది నిమిషాల ముందే సభకు వచ్చిన ఆయన నేరుగా విపక్షాలున్న వైపు వెళ్లారు. తొలుత కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతో మాట్లాడారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన ఇచ్చిన సలహాను ప్రశంసించిన ఆయన.. గోవా సభలో ఆయన చేసిన ఒక వ్యాఖ్యను ఖర్గే చేసిన సూచన సబబే అన్నట్లుగా మోడీ స్పందించారు. అంతకు ముందు సొంత పార్టీకి చెందిన ఎంపీలతో నోట్ల రద్దుపై అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.

ప్రతిపక్ష పార్టీ ఎంపీల వద్దకు వస్తూ.. నల్లదెబ్బ ఎలా ఉంది? మజా వస్తోందా? అంటూ మోడీ ప్రశ్నించిన వైనం అందరిని ఆకట్టుకుంది. ఖర్గేతో మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సభలోకి వచ్చారు. తన సీట్లో కూర్చోనున్న సమయంలో మోడీకి ఆమె నమస్కరించారు. దీనికి ప్రతిగా నమస్కారం చేసిన మోడీ.. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ సూచించగా..అన్నీ జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో ఒకటి ఉంటుందన్న ధోరణిలో సోనియా బదులిచ్చారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్ సభాపక్ష నేత బందోపాధ్యాయ దగ్గరకువెళ్లి ఆయన భుజం మీద చేయి వేసి మాట కలిపారు. ఓపక్కఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ.. మోడీ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వేళ.. మోడీ మిగిలినఎంపీలతో వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఆయన భుజం మీద చేయి వేసి మరీ మాట్లాడటం గమనార్హం.

మోడీ తమ వద్దకు రాగానే టీఎంసీ ఎంపీలు గౌరవంగా లేచి నిలుచున్నారు. పెద్దనోట్ల రద్దు కారణంగా ప్రజలుఇబ్బంది పడుతున్న విషయాన్ని మోడీ దృష్టికి వారు తీసుకురాగా.. త్వరలోనే అవన్నీ సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు. అనంతరం కేంద్రమంత్రి..టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు వద్దకు వెళ్లి.. నోట్లరద్దు నిర్ణయంపై చంద్రబాబు ఏం అంటున్నారని అడిగారు. పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించిన అశోక్ గజపతిరాజు మాటకు స్పందించిన మోడీ.. త్వరలోనే అంతా సర్దుకుంటుందని చెప్పారు. ప్రజలకు త్వరితగతిన డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. అంతా ఓకే అవుతుందన్న మాటను మోడీ చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో.. ఆత్మవిశ్వాసంతో మోడీ కనిపించినట్లుగా ఎంపీలు మాట్లాడుకోవటం కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/