Begin typing your search above and press return to search.

మోడీ కర్ణాటకతో తన గోతి తానే తవ్వుకుంటున్నాడా.?

By:  Tupaki Desk   |   19 May 2018 7:47 AM GMT
మోడీ కర్ణాటకతో తన గోతి తానే తవ్వుకుంటున్నాడా.?
X
అన్ని రోజులు ఒకలా ఉండవు.. అధికారం ఉంది కదా అని విర్రవీగితే కర్రు కాల్చి వాత పెట్టడానికి జనం రెడీగా ఉంటారు.. 9 నెలల్లోనే అధికారం చేపట్టిన ఎన్టీఆర్ మరుసటి ఎన్నికలకు వచ్చేసరికి జనం ఓడించారు. ఎంతటి చరిష్మా ఉంటే ఏం లాభం.. ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిని ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు.. ఇప్పుడు అధికార మదంతో ఆక్రమిస్తే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారు.. చరిత్రలో ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది..

గడిచిన గోవా - మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు.. అక్కడ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.. కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు ఇచ్చారు. కానీ బీజేపీ గద్దెనెక్కింది. ఓ వైపు అధికారం.. మరో వైపు డబ్బు ఆ ఎన్నికల్లో కుమ్మరించి ప్రజాతీర్పును అపహాస్యం చేసిందని కాంగ్రెస్ నేతలు మొత్తుకుంటూనే ఉంటున్నారు. ఇప్పుడు కర్ణాటకలోనూ అదే ప్రయోగం.. మెజార్టీకి ఎనిమిది సీట్లు తక్కవైనా అధికారం దక్కించుకోవడానికి గవర్నర్ సాయంతో బీజేపీ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

బీజేపీ ఇప్పుడు కర్ణాటకలో బలపరీక్షలో నెగ్గుతోంది. కానీ నైతికతలో ఓడిపోతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు.. అధికార దుర్వినియోగానికి పాల్పడి గవర్నర్ ను మధ్యలో పెట్టి కుట్ర చేస్తోందని కాంగ్రెస్ - జేడీఎస్ లు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి. దేశంలోని వ్యవస్థలన్నింటిని బీజేపీ భ్రష్టు పట్టిస్తోందని ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

ఇప్పుడు బీజేపీ కర్ణాటకలో గెలిస్తే కొత్త చిక్కు రావడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న చోట ఆయా ప్రభుత్వాలు కూడా తమ సంగతేంటని.. కర్ణాటకలో బీజేపీని గద్దెనెక్కించినట్టే తమను ఎక్కించాలని గవర్నర్ల వద్దకూ క్యూలు కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీ ఎత్తులు చూశాక.. రేపు కొత్తగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తగినంత మెజార్టీ రాకుంటే అతిపెద్ద పార్టీకే అధికారం ఇవ్వాల్సిన పరిస్థితిని బీజేపీ కల్పించినట్టు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..

అంతిమంగా ఈ పరిణామాలు 2019 ఎన్నికల్లో మోడీపై వ్యతిరేక భావనను ప్రజల్లో పెంచుతుందని కాంగ్రెస్ సీనియర్లు అంచనా వేస్తున్నారు. బీజేపీపై పోరాటానికి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసిపోతాయంటున్నారు. ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా యూపీలో ఎస్పీ - బీఎస్పీలు కలిసి విజయం సాధించాయని.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ సహా మమత - బిజు జనతాదల్ - శివసేన - టీఆర్ ఎస్ - టీడీపీలు జట్టుకడితే బీజేపీ పుట్టి మునిగినట్టేనని అంచనా వేస్తున్నారు. అధికారం కోసం మోడీ ఆడుతున్న ఈ ఆటలు అంతిమంగా ఆయనకే చేటు తెస్తాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.