Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీకి మోదీ ఇవ్వబోయే రెండో షాక్ ఇదే

By:  Tupaki Desk   |   12 Jan 2019 12:00 AM IST
రాహుల్ గాంధీకి మోదీ ఇవ్వబోయే రెండో షాక్ ఇదే
X
జనరల్ కేటగిరీలో రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వర్గాలకు విద్య, ఉద్యోగాలలో 10 శాతం కోటా అమలు చేస్తామని ప్రకటించి దానికి పార్లమెంటు ఆమోదం కూడా పొంది 2019 ఎన్నికల ముందు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు ప్రతిపక్షాలకు మరో మాస్టర్ స్ట్రోక్ కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. ఇప్పటికే 10 శాతం కోటా దెబ్బకు విలవిలలాడుతున్న విపక్షాలు ఈ రెండో దెబ్బకు పూర్తిగా ఎలక్షన్ రేసులో ఎక్కడో వెనుక వరుసలో మిగిలిపోవడం ఖాయమంటున్నారు.

10 శాతం కోటాతో దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని... అయితే, దీనికి తోడుగా మరో భారీ ప్రకటనతో ప్రజల మనసు చూరగొనాలనుకుంటున్నారట మోదీ. ఈసారి చేయబోయే ప్రకటన ప్రజలకు ఆర్థిక లాభం చేకూర్చేది కావడంతో బీజేపీపై ఓట్ల వర్షం కురవడం ఖాయమంటున్నారు.

దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) ద్వారా నెలనెలా రూ.2 వేలు నుంచి రూ.2,500 ఇచ్చేలా మోదీ కొత్త పథకం ప్లాన్ చేశారట. దీనికోసం ప్రభుత్వానికి ఏడాదికి రూ.30 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.

ఆర్బీఐతో రగడ కూడా ఇదే విషయంలో జరిగిందని భావిస్తున్నారు. ఆర్బీఐ వద్ద భారీగా ఉన్న రిజర్వ్ నిధులను ప్రభుత్వం అడిగిందని.. ఈ పథకం కోసమే ఆర్బీఐ నుంచి నిధులు అడిగారని.. దాంతో ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిందని చెబుతున్నారు.

ఇదంతా ఎలా ఉన్నా మోదీ మాత్రం ఈ పథకాన్ని త్వరలో ప్రకటించడానికే అంతా రెడీ చేసకున్నారట. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 27 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. వీరందరికీ మోదీ పథకంతో లబ్ధి కలగనుంది. ఇది మోదీకి కచ్చితంగా ఓట్ల వర్షం కురిపించేదే అవుతుంది.