Begin typing your search above and press return to search.

వేలుపెడితే పరువుపోతుందని భయం!

By:  Tupaki Desk   |   13 Jan 2018 4:21 AM GMT
వేలుపెడితే పరువుపోతుందని భయం!
X
దేశాన్ని కుదిపేస్తున్న పెను సంక్షోభం అనేది ప్రస్తుతానికి సుప్రీం కోర్టుకు సంబంధించినది మాత్రమే అన్నట్లుగా ఒక రకమైన ప్రచారం మీడియా ద్వారా నడుస్తోంది. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని.. ఈ వివాదాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మాత్రమే తమలో తాము చర్చించుకుని అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని కేంద్రం ప్రకటించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే విషయం ఏంటంటే.. తమకు ప్రమేయం లేదని వారు సెలవివ్వడం కాదు.. తాము జోక్యం చేసుకుంటే.. నిందల్ని తాము కూడా మోయవలసి వస్తుందని భయపడుతున్నట్లుగా వాతావరణం ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సుప్రీం కోర్టు నిర్వహణ సక్రమంగా ఉండడం లేదంటూ.. కేసులను సుప్రీం బెంచ్ లకు న్యాయమూర్తులకు కేటాయించే విధానంలో లోపాలు ఉన్నాయంటూ జస్టిస్ చలమేశ్వర్ సహా నలుగురు న్యాయమూర్తులు కలిసి చేసిన ఆరోపణల ప్రకంపనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఈ విషయంలో నరేంద్ర మోడీ చాలా చురుగ్గానే స్పందించారు. ఆయన న్యాయమూర్తుల ప్రెస్ మీట్ అయిన వెంటనే.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో మాట్లాడారు. మరోవైపు సుప్రీం చీఫ్ జస్టిస్ మరియు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ మిశ్రా కూడా సత్వరమే స్పందించారు. ఆయన ప్రభుత్వ అటార్నీ జనరల్ తో సమావేశమై చర్చించారు.

ఈ నలుగురు న్యాయమూర్తులకు మరో ఇద్దరు సుప్రీం న్యాయమూర్తులు కూడా తోడయ్యారు. అంటే చీఫ్ జస్టిస్ వ్యవహార సరళిపై నిరసనలు వ్యక్తం చేసేవారు పెరిగారు. ఇదంతా చూస్తోంటే.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సంబంధించిన వివాదంగా కనిపిస్తున్నది గానీ.. అంతిమంగా ప్రస్తుతం వెల్లువెత్తుతున్న ఆరోపణలు న్యాయవ్యవస్థ నిజాయితీని కూడా ప్రశ్నార్థకంగా మారుస్తున్న విషయాలు అని గుర్తించాల్సి ఉంది. ఈనేపథ్యంలో చీఫ్ జస్టిస్ ను అభిశంసించాలో వద్దో ప్రజలే నిర్ణయించుకోవాలంటూ.. జస్టిస్ చలమేశ్వర్ బంతిని ప్రజల కోర్టులోకి వదిలి ఊరుకున్నారు. సీజే వ్యవహారం గురించి ఆరోపణలు ఇంతదూరం వచ్చిన తర్వాత.. దీపక్ మిశ్రా రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా పుకార్లు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో తాము వేలుపెడితే సుప్రీం న్యాయవ్యవస్థ పరిపాలన గాడి తప్పడానికి రాజకీయ జోక్యం కూడా కారణమౌతోందనే నిందలు భరించాల్సి వస్తుందనే ఉద్దేశంతో మోడీ సర్కారు మౌనం పాటిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.