Begin typing your search above and press return to search.

ఏంటిది: ట్రంప్ సభను మోడీ నిర్వహించట్లేదా?

By:  Tupaki Desk   |   22 Feb 2020 5:30 PM GMT
ఏంటిది: ట్రంప్ సభను మోడీ నిర్వహించట్లేదా?
X
మొన్నామధ్య భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో హుస్టన్ లో ఏర్పాటు చేసిన ‘హౌడీ మోడీ’ ఎంత సక్సెస్ అయ్యిందో చూశాం. భారతీయులను ఒక్కచోటకు చేర్చి ఇండియన్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో నిర్వహించిన ఈ సభ అందరినీ ఆకట్టుకుంది. మోడీ - ట్రంప్ లకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. ట్రంప్ కు భారతీయుల ఓటు బ్యాంకును విపరీతంగా పెంచేసింది.

అప్పుడు తనకు ట్రీట్ ఇచ్చిన ట్రంప్ కు సైతం అదే రీతిలో స్వాగతం పలుకుతున్నారు ప్రధాని మోడీ. తన సొంత రాష్ట్ర గుజరాత్ లో కొత్తగా కట్టిన 1.10 లక్షల మంది పట్టే మోతేరా స్టేడియాన్ని ప్రారంభించి ఆ సభలో ‘నమస్తే ట్రంప్’ అనే సభను ఏర్పాటు చేయించారు. ఇందులో ట్రంప్ తో మాట్లాడించేస్తున్నారు.

అయితే అమెరికా అధ్యక్షుడు పాల్గొంటున్న ఈ ‘నమస్త ట్రంప్’ లాంటి పెద్ద సభను నిర్వహించడానికి మోడీయే ముందటపడి ఉంటాడని.. కేంద్రం నిర్వహిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ట్రంప్ సభా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ గుజరాత్ ప్రభుత్వం కానీ నిర్వహించడం లేదన్న షాకింగ్ విషయం బయటపడింది.

ఈ ‘నమస్తే ట్రంప్’ సభను ‘‘డొనాల్డ్ ట్రంప్ నాగరిక్ అభినందన్ సమితి’’ అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. వీరే అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రావీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.

120 కోట్లు ఖర్చు పెట్టి ట్రంప్ కోసం మోడీ ఈ సభ పెట్టారని.. దేశ సంపదను దుబారా చేశాడని కాంగ్రెస్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ నేపథ్యంలో అసలు ఈ కార్యక్రమాన్ని మోడీ సర్కారు నిర్వహించడం లేదని కేంద్రం తెలిపింది. ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోందని వివరణ ఇచ్చింది. సర్కారు చెప్పిన ఈ డొనాల్డ్ ట్రంప్ నాగరిక్ అభినందన్ సమితి అనేది అసలు ఉనికిలోనే లేదు. ఈ సంస్థ డిజిటల్ మీడియాలోనూ లేదు. అలాంటిది ఒక్కసారిగా ఏకంగా ట్రంప్ సభను ఎలా నిర్వహిస్తోందన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. 120 కోట్లు ఖర్చు చేస్తున్న ఈ సభ గురించి కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఓ ఊరుపేరు లేని ప్రైవేటు సంస్థను బీజేపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చినట్టు అర్తమవుతోందంటున్నారు.