Begin typing your search above and press return to search.

ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ మార్పు వెనుక మోదీ వ్యూహం ఇదేనా?

By:  Tupaki Desk   |   13 Dec 2018 7:17 AM GMT
ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ మార్పు వెనుక మోదీ వ్యూహం ఇదేనా?
X
రిజ‌ర్వు బ్యాంకు గ‌వ‌ర్న‌ర్ ఊర్జిత్ ప‌టేల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం తాజాగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్లే ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పిన‌ప్ప‌టికీ.. ప్ర‌ధాని నరేంద్ర‌ మోదీ నేతృత్వంలోని కేంద్ర‌ప్ర‌భుత్వంతో ఆయ‌న‌కు చాన్నాళ్లుగా పొస‌గ‌డం లేద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఇటీవ‌ల చాలా విష‌యాల్లో ప్ర‌భుత్వం - ఆర్బీఐ మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప్ర‌భుత్వంతో ప‌లు అంశాల్లో ఆయ‌న ఏకీభ‌వించ‌లేదు. అందుకే కేంద్రం ఆయ‌న‌కు పొమ్మ‌న‌కుండా పొగ‌బెట్టింద‌న్న‌ది విశ్లేష‌కుల వాద‌న‌.

ఊర్జిత్ రాజీనామాతో కేంద్రం ఏమాత్రం ఆశ్చ‌ర్య‌పోలేదు. ఆందోళ‌న చెంద‌లేదు. తాము కోరుకున్న‌దే జ‌రిగింద‌న్న‌ట్లుగా సంతోషించింది. వెంట‌నే త‌మ‌కు విశ్వాసపాత్రుడైన శ‌క్తికాంత దాస్ ను ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విలో కూర్చోబెట్టింది. నిజానికి దేశంలోనే స‌ర్వోత్కృష్ఠ బ్యాంకు ఆర్బీఐ. దాని అధినేత ఎంపిక‌కు చాలా క‌స‌ర‌త్తులు అవ‌స‌రం. కేంద్రం మాత్రం ఊర్జిత్ ఇలా వెళ్ల‌గానే అలా శ‌క్తికాంత దాస్‌ ను గ‌వ‌ర్న‌ర్‌ గా నియ‌మించింది.

ఈ ప‌రిణామాల‌తో మోదీ ప్ర‌భుత్వంపై ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆర్బీఐ వ‌ద్ద ఉన్న రూ.9 ల‌క్ష‌ల కోట్లను చేజిక్కించుకునేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంద‌ని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్బీఐ నుంచి ఆ నిధులు ద‌క్కించుకొని.. వాటితో రైతుల రుణాలు మాఫీ చేసి.. తిరిగి అధికారంలోకి రావాలన్న‌దే మోదీ స‌ర్కారు వ్యూహం కావొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

2014లో మోదీ అధికారంలోకి రావ‌డంలో రైతులది కీల‌క పాత్ర‌. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ ఆయ‌న చేసిన వాగ్దానాలు అప్ప‌ట్లో అంద‌ర్నీ ఆకర్షించాయి. నిజంగానే త‌మ బ‌తుకులు బాగుప‌డ‌తాయ‌ని అన్న‌దాత‌లు విశ్వ‌సించారు. కానీ వారు ఆశించిందేమీ జ‌ర‌గ‌లేదు. అందుకే మోదీ ప్ర‌భుత్వానికి ఇప్పుడు ఎదురుతిరుగుతున్నారు. రాజ‌స్థాన్‌ - మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ - ఛ‌త్తీస్‌ గ‌ఢ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ప‌రాజ‌యానికి రైతుల ఆక్రోశ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు - రూ.2 ల‌క్ష‌ల చొప్పున రుణాలు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ రైత‌న్న‌ల‌కు చేరువ‌వుతున్నారు. యూపీపీ -1 ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా రూ. 70వేల కోట్ల రుణాలను మాఫీ చేసి ఎన్నికలకు వెళ్లింది కాంగ్రెస్‌. ఫ‌లితంగా రెండో ద‌ఫా అధికారం ద‌క్కింది. ఎన్డీఏ-2 కోసం మోదీ కూడా ప్ర‌స్తుతం అదే తరహా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆర్బీఐ నుంచి నిధులు పొంది రుణ‌మాఫీ చేయాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ ప్ర‌ణాళిక‌ల్లో భాగంగానే తాను చెప్పిన‌ట్లు వినే శ‌క్తికాంత దాస్ ను ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విలో మోదీ కూర్చోబెట్టార‌ని విశ్లేష‌కులు చెప్పుకుంటున్నారు.