Begin typing your search above and press return to search.

మోదీ ఇగోకు ప్ర‌తిరూపం 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ'!

By:  Tupaki Desk   |   30 Oct 2018 3:08 PM GMT
మోదీ ఇగోకు ప్ర‌తిరూపం స్టాట్యూ ఆఫ్ యూనిటీ!
X
ప్ర‌పంచంలోకెల్లా అతి పెద్ద విగ్ర‌హంగా స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ పటేల్‌ విగ్రహం రూపుదిద్దుకున్న సంగ‌తి తెలిసిందే. 600 అడుగుల ఎత్తున్న `స్టాట్యూ ఆఫ్ యూనిటీ` విగ్ర‌హం కోసం దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చుపెట్టిన మోదీ స‌ర్కార్....అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా దానిని నిర్మించింది. ప్ర‌పంచ స్థాయి ప‌ర్యాట‌క ప్రాంతంగా దానిని తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తోంది. గుజ‌రాత్ లోని న‌ర్మ‌దా న‌ది తీరంలో కొలువుదీరిన ఈ విగ్ర‌హాన్ని ప్ర‌ధాని మోదీ రేపు ప‌టేల్ జ‌యంతి సంద‌ర్భంగా ఆవిష్క‌రించ‌బోతున్నారు. నెహ్రూ - గాంధీల కుటుంబాల‌కే క్రెడిట్ అంతా వెళ్లింద‌ని - ప‌టేల్ కు స‌ముచిత గౌర‌వం ద‌క్క‌లేద‌న్న నేప‌థ్యంలో మోదీ...ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ విగ్ర‌హం కేంద్రంగా మోదీ...హిందూత్వ రాజ‌కీయాల‌కు తెర‌తీయ‌బోతున్నారని అనుకుంటున్నారు.

ప్ర‌పంచంలోకెల్లా అత్యంత ఎత్తైన విగ్ర‌హం ఏర్పాటు చేయ‌డం ద్వారా త‌న ప్ర‌తిష్ట కూడా అంత ఎత్తుకు ఎద‌గాల‌నేది మోదీ ఆలోచ‌న అన్న విమ‌ర్శ‌లు వస్తున్నాయి. గాంధీ - నెహ్రూ కుటుంబాల‌కు ఇన్నాళ్లూద‌క్కుతోన్న క్రెడిట్ ను ఈ విగ్ర‌హంతో ప‌టేల్ కు క‌ట్ట‌బెట్టాల‌ని మోదీ ప్లాన్ చేస్తున్నార‌ని అంత‌ర్జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మోదీ పొలిటిక‌ల్ ఇగోను ఈ విగ్ర‌హం శాటిస్ ఫై చేస్తుంద‌ని అనుకుంటున్నారు. అందుకే స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ క‌న్నా నాలుగు రెట్లు పెద్ద‌దిగా దీనిని నిర్మించార‌ని టాక్. భార‌త‌దేశం ఎంత ఉన్న‌తంగా ఎదుగుతుందో తెలియ‌జెప్పేలా ఈ విగ్ర‌హం ఎత్తు ఉండాల‌నేది మోదీ ఆకాంక్ష‌. అఖండ భార‌తావ‌నిని ముక్క‌లు కాకుండా క‌లిసి ఉండ‌డంలో ప‌టేల్ కీల‌క పాత్ర పోషించార‌ని - అందుకే ఆయ‌న‌కు స‌ముచిత గౌర‌వం ద‌క్కేలా మోదీ ఈ విగ్ర‌హం ప్ర‌తిష్టించార‌ని టాక్. మ‌రి, ఉక్కు మనిషి విగ్ర‌హం ప్లాన్ బీజేపీకి వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో వేచిచూడాలి.