Begin typing your search above and press return to search.

కోడిని అడిగితే చికెన్ పీస్ ఇస్తారా మోడీ?

By:  Tupaki Desk   |   1 March 2019 5:23 AM GMT
కోడిని అడిగితే చికెన్ పీస్ ఇస్తారా మోడీ?
X
మీ ఆస్తులు ఒక పెద్దాయ‌న చేతుల్లో ఉన్నాయి. ఆయ‌నేమో మీ ఆస్తులు మీకు ఇవ్వ‌టానికి స‌సేమిరా అంటున్నాడు. అలాంటివేళ‌లో.. ఆ పెద్దాయ‌న ద‌య‌త‌ల‌చి.. నువ్వు మ‌రీ అంత‌లా అడుగుతున్నావు క‌దా.. నీకేం కావాలి? అని అడిగితే.. అయ్యా.. రోజూ గుడ్డు పెట్టే ఒక కోడిని ఇవ్వండి కోరార‌నుకోండి. ఆ పెద్ద మ‌నిషి.. కోడి కాదు కానీ చికెన్ ముక్క ఇస్తా తీస్కో అంటే ఎలా ఉంటుంది? కోడి పెట్టే గుడ్డుతో బ‌తుకు బండి లాగుదామ‌ని ఆశించిన అత‌డి చేతిలో చికెన్ ముఖ్క ఇస్తే ఎలా ఉంటుంది?

దాదాపు ఇలాంటి ప‌రిస్థితే ఏపీకి ఎదురైంద‌ని చెప్పాలి. మోడీ పుణ్య‌మా అని.. ఇప్ప‌టికే ఏపీకి జ‌ర‌గాల్సిన డ్యామేజ్ భారీగా జ‌రిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏపీ విభ‌జ‌నకు కాంగ్రెస్ పూనుకోవ‌టం.. తాము చేస్తున్న విభ‌జ‌న కార‌ణంగా దారుణంగా దెబ్బ తినే ఏపీ కోసం విశాఖ రైల్వే జోన్ అనే కోడిని ఇస్తామంటూ హామీ ఇచ్చారు.

మొత్తం పోయిన వేళ‌.. ఏదో ద‌య‌త‌లిచి ఇస్తున్న దానిని కాద‌న‌లేక ఓకే అన్న ఏపీ ప్ర‌జ‌ల‌కు హ్యాండ్ ఇచ్చేలా విశాఖ రైల్వే జోన్ హామీలో కీల‌క‌మైన ఆదాయ‌వ‌న‌రు ఒడిశాకు ఇచ్చేసి.. అలంకార‌ప్రాయ‌మైన జోన్ ను ఇస్తూ మోడీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకోవ‌టం గ‌మ‌నార్హం.

మోడీ స‌ర్కారు ప్ర‌క‌టించిన ఏపీ జోన్ విష‌యంలో తూర్పు కోస్తా రైల్వేలో భాగ‌మైన వాల్తేరు డివిజ‌న్ ను మాత్రం ఒడిశాకు అప్ప‌జెప్ప‌టం ద్వారా.. కీల‌క‌మైన ఆదాయ‌వ‌న‌రు ఒడిశాకు.. కంటితుడుపు జోన్ ఏపీకి ఇచ్చిన‌ట్లైంది. విభ‌జ‌న హామీని తాము అమ‌లు చేస్తున్న‌ట్లు చెబుతున్న కేంద్రం.. విజ‌య‌వాడ‌.. గుంటూరు.. గుంత‌క‌ల్ డివిజ‌న్ల‌ను క‌లుపుతూ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వేను ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యంతో ఏపీకి ఏమాత్రం ఒర‌గ‌దు స‌రిక‌దా.. లేనిపోని ఇబ్బందిగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఆదాయం పెద్ద‌గా లేని రూట్ల‌ను ఇవ్వ‌టం.. అది కూడా ఏపీలోని కొన్ని ప్రాంతాల‌కు ప‌రిమితం చేస్తూ జోన్ ఇవ్వ‌టం ఆంధ్రోళ్ల‌కు హ్యాండ్ ఇవ్వ‌టంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఆగ్నేయ రైల్వేలో భాగంగా ఉన్న వాల్తేరు డివిజ‌న్ ను 2003లో విడ‌దీసి ఒడిశాకు ఇచ్చారు. ఇప్పుడు చేసిన విభ‌జ‌న‌లో వాల్తేరు డివిజ‌న్ లో భారీ ఆదాయాన్ని ఇచ్చే భాగాన్ని ఒడిశాకే ప‌రిమితం చేయ‌టంతో రైల్వే జోన్ ఇచ్చినా ఏపీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.