Begin typing your search above and press return to search.

యూపీలో మోడీ ప్లాన్స్ రివర్స్

By:  Tupaki Desk   |   24 Dec 2021 6:35 AM GMT
యూపీలో మోడీ ప్లాన్స్ రివర్స్
X
ఉత్తరప్రదేశ్ లో రెగ్యులర్ గా పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒమిక్రాన్ ఆంక్షల దెబ్బ పడింది. తొందరలో జరగబోయే యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోడి తరచు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిపించుకోవటం మోడీకి చాలా అవసరం.

క్షేత్రస్థాయిలో ఏమో బీజేపీకి అంత సీనుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు రైతు సంఘాల మోడీ సర్కార్ పై మోగించిన యుద్ధభేరి బీజేపీకి చాలా ఇబ్బందిగా తయారైంది.

ఒకవైపు జాట్లు, ముస్లింలు, మరోవైపు రైతు సంఘాలు, ఇంకోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలతో బీజేపీ ప్రభుత్వానికి నిజంగానే ఊపిరి సరిగా ఆడటంలేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే స్వయంగా మోడీయే రంగంలోకి దిగారు. ఈ నెలలో ఇప్పటికే వివిధ కారణాలతో మూడు సార్లు పర్యటించారు. వారణాశి వీధుల్లో ముఖ్యమంత్రి యోగి తో కలిసి పాదయాత్ర కూడా చేశారు. శంకుస్ధాపనలని, ప్రారంభోత్సవాలని భారీ ర్యాలీలు నిర్వహించారు.

ఇలాంటి నేపథ్యంలో మరో నాలుగు సార్లు పర్యటనలు చేయటానికి రెడీ అయ్యారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోడీ ర్యాలీలు, సభల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాన్ చేసింది. సరిగ్గా ఇలాంటి నేపథ్యంలో ర్యాలీలు, బహిరంగసభలు వద్దని అలహాబాద్ హైకోర్టు సూచించింది.

విస్తరిస్తున్న ఒమిక్రాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జనాలు పెద్దఎత్తున గుమిగూడె అవకాశం ఉన్న ర్యాలీలు, బహిరంగ సభలను రద్దు చేసుకోవాలని ఏకంగా మోడికీ హైకోర్టు సూచించటం గమనార్హం.

మోడీ పాల్గొనే ర్యాలీలు, సభలను సక్సెస్ చేయటం కోసం స్ధానిక పార్టీ, ప్రభుత్వ యంత్రాంగాలు పెద్దఎత్తున జనసమీకరణ చేయటం ఖాయం. దానివల్ల ఎక్కువమంది జనాలు ఒకేచోట గుమిగూడుతారు. దీంతో ఒమిక్రాన్ విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. అలాగే యూపీలో షెడ్యూల్ ఎన్నికలను కూడా రెండునెలలు వాయిదా వేసే అవకాశాన్ని పరిశీలించాలని కూడా హైకోర్టు కేంద్ర ఎన్నికల కమీషన్ కు సూచించింది.

ఒమిక్రాన్ తీవ్రత కారణంగా ఎన్నికలను కొంతకాలం వాయిదా వేసిన వచ్చే నష్టమేమీ లేదని హైకోర్టు అభిప్రాయపడినట్లుంది. బహుశా తమిళనాడు ఎన్నికల్లో జరిగిన పరిణామాలను అలహాబాద్ హైకోర్టుకు గుర్తుకొచ్చినట్లుంది. ఏదేమైనా మోడీ పర్యటనలపై ఒమిక్రాన్ ఆంక్షల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరి హైకోర్టు సూచనల నేపధ్యంలో మోడీ ఏమిచేస్తారు ? కేంద్ర ఎన్నికల కమీషన్ ఏమి చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.