Begin typing your search above and press return to search.

మన సైన్యం ఎంత గొప్పదంటే..?

By:  Tupaki Desk   |   15 Oct 2016 4:49 AM GMT
మన సైన్యం ఎంత గొప్పదంటే..?
X
తెలిసిన విషయాన్ని సరికొత్తగా చెప్పటం.. ఆసక్తికరంగా మల‌చ‌టం ప్రదాని మోడీకి చేతనైనంత బాగా మరెవరికీ చేతకాదేమో. భారత సైన్యం గొప్పతనం గురించి ఆయన కీర్తించిన వైనం దేశ వాసుల్ని ఆకట్టుకోవటమే కాదు.. సైన్యానికి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు. దేశంలో తొలిసారి భోపాల్ లో నిర్మించిన శౌర్య స్మారకాన్ని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు.. వారి కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి ఆయ‌న‌ ప్రసంగించారు. భారత సైన్యం గొప్పతనం గురించి చెబుతూ.. మనది మాటల సైన్యం కాదని చేతల సైన్యంగా అభివర్ణించిన మోడీ.. దేశ ప్రజలకు సున్నితమైన హెచ్చరికను తనదైన శైలిలో చేశారు.

దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తే.. సైన్యం సంతోషిస్తుందని.. వారికి ఎలాంటి ఇబ్బంది లేదని.. కానీ.. మనం మెలుకువగా ఉండాల్సిన వేళలోనూ నిద్రిస్తే సైన్యం మనల్ని ఎప్పటికి క్షమించదన్నారు. స్వేచ్ఛకు మనం చెల్లించాల్సిన మూల్యం నిరంతర అప్రమత్తతగా అభివర్ణించిన మోడీ.. అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలో నిద్రిస్తే సైన్యానికి అన్యాయం చేసినట్లేనని వ్యాఖ్యానించారు. సర్జికల్ దాడులకు సాక్ష్యాల్ని డిమాండ్ చేసే వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్ సైన్యం చేతలు ప్రదర్శిస్తుందే తప్పించి..మాటలు చెప్పదని.. ఇదే విషయాన్ని తాను గతంలో చెప్పి ఉంటే.. విమర్శకులు తనపై పెద్ద ఎత్తున మండిపడేవారంటూ.. రక్షణ మంత్రి పారికర్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘మన సైన్యం తరహాలోనే రక్షణ మంత్రి కూడా మాటలు చెప్పరంటూ’’ పారికర్ ను పొగిడేసిన మోడీ.. భారతదేశ విశిష్ఠతను గుర్తు చేశారు. చరిత్రలో మన పూర్వీకులు ఎవరూ పరాయి దేశాన్ని ఆక్రమించుకోవటానికి యుద్ధం చేయలేదని.. విలువలు.. సిద్దాంతాల కోసం పోరాడాల్సి వస్తే.. భారత్ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మన సైనికుల మానవత్వాన్ని ప్రదర్శించే రెండు ఉదంతాల గురించి ఆయ‌న‌ ప్రస్తావించారు.

మొదటిది..

భారత సైన్యం గొప్పతనం గురించి మోడీ చెబుతూ.. ‘‘రెండేళ్ల కిందట శ్రీనగర్ మొత్తాన్ని భారీ వరద ముంచెత్తింది. శ్రీనగర్ లో బాధితులకు సాయం అందించేందుకు సైన్యం చేసిన సాయాన్నిమర్చిపోకూడదు. వరదలతో ఏర్పడిన పరిస్థితిని చక్కదిద్దటం ప్రభుత్వానికి కష్టమైంది. అప్పుడు మన జవాన్లు రంగంలోకి దిగారు. ఎంతో కష్టపడి ప్రజల ప్రాణాల్ని కాపాడారు. ఇదే ప్రజల్లోని కొందరు తమపై రాళ్లు రువ్వుతారని.. తమ తలలు పగలగొడతారని.. కంటి చూపు దెబ్బ తీస్తారని వారు ఊహించలేదు’’ అని వ్యాఖ్యానించారు.

రెండోది..

‘‘ప్రకృతి విపత్తుల్లోనూ.. అసాధారణ సందర్భాల్లో వారు చూపే ధైర్యసాహసాలు.. ప్రదర్శించే తెగువను ఎంత చెప్పినా తక్కువే. యుద్ధం ఊబిలో చిక్కుకుపోయిన యెమన్ నుంచి 5వేల మంది భారతీయుల్ని.. ఇతర దేశస్తుల్ని భారత సైన్యం రక్షించింది. వీరిలో పాకిస్థానీలు కూడా ఉన్నారు. అంతర్జాతీయ శాంతిని కాపాడే విషయంలో భారత సైన్యం సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తోంది. సాటి మనుషుల గురించి ఆలోచించటం.. క్రమశిక్షణతో ఉండటం లాంటి వాటి కొలమానాల్ని ఆధారంగా చేసుకుంటూ మన సైనిక దళం ప్రపంచంలోనే అత్యుత్తమ దళాల్లో ఒకటిగా ఉంటుంది’’అని భారత సైన్యం గొప్పదనం గురించి కీర్తించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత సైన్యానికి మోడీ మాటలు ఉత్ప్రేర‌కంగా పని చేయటమే కాదు.. వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయనటంలో సందేహం లేదు. అదే సమయంలో.. భారత సైన్యాన్ని ప్రజలు ఎంతగా ఆరాధించాలన్న విషయాన్ని మోడీ తన మాటలతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/