Begin typing your search above and press return to search.

జ‌మిలికి మోడీ సై.. ప్లాన్ సిద్ధ‌మైందా?

By:  Tupaki Desk   |   28 Jun 2019 4:42 AM GMT
జ‌మిలికి మోడీ సై.. ప్లాన్ సిద్ధ‌మైందా?
X
ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా సాగిన వ‌రుస ఎన్నిక‌ల‌తో తెలంగాణ ప్ర‌జ‌లు విసిగిపోయిన ప‌రిస్థితి. గ‌త ఏడాది అక్టోబ‌రుతో మొద‌లైన ఎన్నిక‌ల సంద‌డి ఈ నెల మే చివ‌రి వ‌ర‌కూ సాగ‌టం తెలిసిందే. ఇంత సుదీర్ఘంగా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా వ‌చ్చి ప‌డిన ఎన్నిక‌ల పుణ్య‌మా అని పాల‌నా వ్య‌వ‌స్థ మొత్తం ప్ర‌భావిత‌మైంది.

ఒక రాష్ట్రంలో ఇలాంటి ప‌రిస్థితి ఉంటే.. దేశ వ్యాప్తంగా ప్ర‌తి ఏడాది కొన్ని రాష్ట్రాల్లో ఎన్నిక‌లు.. ఆయా రాష్ట్రాల్లో ఉండే రాజ‌కీయ ప‌రిస్థితుల కార‌ణంగా వెలువ‌డే ఫ‌లితాలు జాతీయ రాజ‌కీయాల మీద ప‌డ‌టం.. అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాల‌కు ఇబ్బందిగా మార‌టం తెలిసిందే. అంతేకాదు.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా అమ‌ల్లోకి వ‌చ్చే కోడ్ కార‌ణంగా పాల‌నాప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేని ప‌రిస్థితి. ఇలాంటి ఇబ్బందిని అధిగ‌మించ‌టానికి వీలుగా ఒక దేశం.. ఒక ఎన్నిక‌ల పాల‌సీని తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు ప్ర‌ధాని మోడీ.

జ‌మిలి ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న మోడీ అందుకు త‌గ్గ‌ట్లే రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. జ‌మిలి ఎన్నిక‌లు కేవ‌లం పాల‌నాప‌ర‌మైన అవ‌స్థ‌లు త‌గ్గించ‌టానికి అన్న‌ట్లు పైకి క‌నిపించినా లోగుట్టు మాత్రం తిరుగులేని అధికారాన్ని త‌న చేతుల్లోకి తీసుకోవ‌టంలో భాగంగానే మోడీ భారీ ప్లాన్ వేసిన‌ట్లుగా చెబుతున్నారు. సాధార‌ణంగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక ఎజెండా.. లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు మ‌రో ఎజెండా క‌నిపిస్తూ ఉంటుంది. చాలా సంద‌ర్భాల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా లోక‌ల్ అంశాలు కూడా అంతో ఇంతో ప్ర‌భావితం చేస్తుంటాయి.

అందుకు రెండు ఎన్నిక‌ల్ని ఒకేసారి నిర్వ‌హించ‌టం వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా ఉండే సానుకూల‌త అంతో ఇంతో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ప్ర‌భావితం చూపిస్తుంద‌ని చెబుతున్నారు. జ‌మిలి ఎన్నిక‌ల‌తో వీలైనంత ఎక్కువ ప్ర‌యోజ‌నం పొందాల‌ని భావిస్తున్న మోడీ అందుకు త‌గ్గ‌ట్లే జ‌మిలి ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హించాలంటే రాజ్యాంగ స‌వ‌ర‌ణ త‌ప్ప‌నిస‌రి. దేశ వ్యాప్తంగా లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు.. దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల్ని ఒకేసారి నిర్వ‌హించే ఈ తీరును ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు వ్య‌తిరేకిస్తున్నాయి. అయితే.. వారికి అవకాశం ఇవ్వ‌కుండా త‌న‌కు తానే డిసైడ్ చేయాల‌న్న‌ట్లుగా మోడీ ఆలోచ‌న ఉంది.

ఐదేళ్లు తిరుగులేని అధికారం చేతిలో ఉన్నా.. రెండో ట‌ర్మ్ అధికారం చేతికి వ‌చ్చినా రాజ్య‌స‌భ‌లో మాత్రం బీజేపీకి ప‌ట్టు చిక్కలేదు. ఇప్పుడు స‌మీక‌ర‌ణాల ప్ర‌కారం మ‌రో రెండేళ్ల‌కు అంటే 2021 నాటికి రాజ్య‌స‌భ‌లో బీజేపీ త‌న అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించుకోగ‌లుగుతుంది. అప్పుడే జ‌మిలి ఎన్నిక‌ల‌కు సంబంధించి రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ను చేయ‌గ‌లుగుతుంది. ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ‌లో త‌మ చేతికి అధిక్య‌త వ‌చ్చినంత‌నే జ‌మిలి బిల్లును పాస్ చేయించుకోవ‌టంతో పాటు.. ఆ వెంట‌నే ఎన్నిక‌ల్ని కూడా నిర్వ‌హించేలా ప్లాన్ చేయ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది.

అదే జ‌రిగితే 2022 చివ‌ర్లో కానీ.. 2023 మొద‌ట్లో కానీ జ‌మిలి ఎన్నిక‌లు దేశ వ్యాప్తంగా జ‌ర‌గ‌నున్నాయి. అదే జ‌రిగితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ‌కున్న గ‌డువుకు ముందే ఎన్నిక‌ల‌కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అదే జ‌రిగితే వారి ప‌ద‌వీ కాలం ముందుగానే ముగిసిపోతుంది. మోడీ ప్లానింగ్ చూస్తుంటే.. రానున్న రోజుల్లో జాతీయ రాజ‌కీయాలు హాట్ హాట్ గా మార్చేసేలా ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.