Begin typing your search above and press return to search.

సీఎంకు అమిత్ షా నోటీస్ షాక్

By:  Tupaki Desk   |   18 Oct 2015 9:40 AM GMT
సీఎంకు అమిత్ షా నోటీస్ షాక్
X
ఏదోలే అన్నట్లుగా ఊరుకుండిపోతే.. మౌనం అర్థాంగీకారం అన్నట్లుగా చెలరేగిపోయి.. గత కొద్దిరోజులుగా గో మాంసం.. దాద్రి ఘటనపై బీజేపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడటం.. చివరకు ముఖ్యమంత్రులుగా పని చేస్తున్న నేతలు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మోడీ సర్కారును ఇరుకున పడేస్తోంది. దీనిపై రాజకీయ పక్షాల నిరసన కంటే కూడా.. కవులు.. కళాకారులు.. మేధావుల నిరసన.. తమకిచ్చిన అత్యుత్తమ పురస్కారాల్ని వెనక్కి తిరిగి ఇచ్చే విషయంపై ఒకరి తర్వాత ఒకరు స్పందిస్తున్న తీరు ఎన్డీయే సర్కారుకు ఇబ్బందిగా మారింది.

దీంతో.. నష్టనివారణకు నడుం బిగించినట్లుగా ఉంది. ఈ మధ్య కాలంలో గో మాంసం మీద.. దాద్రి ఘటనతో పాటు ముస్లిం వ్యతిరేకంగా బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీరియస్ అయ్యారు. నేతలు చేస్తున్న పిచ్చి గోలతో ప్రధాని మోడీ తీవ్రంగా పరిగణిస్తున్నారని.. ఆయనకు బాధను కలిగిస్తున్నాయని తాజాగా వెల్లడించారు.

‘‘ఈ పిచ్చి గోలేంటి?’’ అంటూ ప్రశ్నించిన ఆయన.. ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. కేంద్ర మంత్రి మహేశ్ శర్మ.. బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్.. ఎమ్మెల్యే సంగీత్ సోమ్ లకు సమన్లు జారీ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారి విషయంలో చూస్తూ ఊరుకోమని.. కఠిన చర్యలు తప్పవన్న సందేశాన్ని తాజా నోటీస్ తో స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల కారణంగా దేశంలో ఆశాంతి మరింత పెరిగిపోతుందని.. హిందూ.. ముస్లింల మధ్య సరికొత్త అలజడి మొదలైందన్న వాదనల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం సీరియస్ అయ్యింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వెనువెంటనే సమాధానం ఇవ్వాలని.. ఇలాంటి వ్యాఖ్యల్ని ప్రధాని మోడీ సహించరంటూ అమిత్ షా తాజా ప్రకటనతో స్పష్టం చేశారు. మరి.. అధినాయకత్వం ఇచ్చిన సమన్లతో కమలనాథుల నోటికి తాళాలు పడతాయా? లేదా? అన్నది కాలమే బదులివ్వాలి.