Begin typing your search above and press return to search.

దేశమంతా రామమయం .. ఏళ్ల నిరీక్షణ ముగిసింది.. భావోద్వేగానికి గురైన మోదీ

By:  Tupaki Desk   |   5 Aug 2020 2:35 PM GMT
దేశమంతా రామమయం .. ఏళ్ల నిరీక్షణ ముగిసింది.. భావోద్వేగానికి గురైన మోదీ
X
అయోధ్య లో రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ తీవ్రమైన భావోద్వేగానికి గురైయ్యారు. ఈ రోజు ఎంతో పవిత్రమైనది అని, వందల ఏళ్ల నిరీక్షణ నేటితో ముగిసిందని చెప్పారు. దేశ ప్రజలందరి ఆకాంక్షలతో రామ మందిరం నిర్మాణం జరుపుకుంటోందని తెలిపారు. సంవత్సరాల సంకల్పం, అంకితభావం, పోరాటం పరాకాష్టను ఈ రోజు సూచిస్తుందని, ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని ప్రపంచంలోని ఏ మూల నుంచి చూసినా ఉద్వేగానికి గురవుతారని తెలిపారు. జై శ్రీరామ్ అనే పదం ఇక్కడ మాత్రమే కాదని, ప్రపంచం మొత్తం ప్రతిధ్వనిస్తుందని అన్నారు.

రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం చేశారని, బలిదానం చేశారని చెప్పారు. వారందరి బలిదానాలతో, త్యాగాలతో రామమందిర నిర్మాణం సాకారమవుతోందని అన్నారు. 130 కోట్ల ప్రజలు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిగిందని... వారి పోరాటంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని... అదే విధంగా రామాలయం కోసం కూడా పెద్ద పోరాటం జరిగిందని తెలిపారు. ఈ రోజు జయజయ ధ్వానాలు శ్రీరాముడికి వినిపించకపోవచ్చు కానీ, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తులకు వినిపిస్తాయన్నారు. మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం నా మహద్భాగ్యమని, దీనిని రామజన్మభూమి ట్రస్టు నాకు కల్పించిందన్నారు. అలాగే నేడు దేశం మొత్తం రామమయం అయింది అని తెలిపారు.

రాముడి కార్యక్రమాలన్నింటినీ హనుమంతుడు చూస్తాడని, హనుమంతుడి ఆశీస్సులతోనే ఈరోజు మందిర నిర్మాణం ప్రారంభమైందని మోదీ అన్నారు. కోటాను కోట్ల హిందువులకు ఆలయ నిర్మాణం ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. దేశ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయమని అన్నారు. ఇదొక అద్భుతమైన సందర్భమని, నరుడిని నారాయణుడితో కలిపే ఘట్టమని చెప్పారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయని చెప్పారు.ఇక అంతకు ముందు తొలుత స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని విడుదల చేశారు.