Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు ఝ‌ల‌క్‌ ఇచ్చిన మోడీ

By:  Tupaki Desk   |   19 Sep 2015 4:22 AM GMT
కేసీఆర్‌ కు ఝ‌ల‌క్‌ ఇచ్చిన మోడీ
X
అస‌లే అంతంత మాత్రంగా ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం, తెలంగాణ సర్కారు మ‌ధ్య సంబంధాలకు మ‌రో వివాదాస్ప‌ద అంశం జోడ‌యింది. తాజా వివాదానికి సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆజ్యం పోయ‌డం గ‌మ‌నార్హం.

నాటి ఉప‌ ప్ర‌ధాని స‌ర్దార్ వ‌ల్ల‌భ బాయ్ ప‌టేల్ త‌న ధీర‌త్వంతో నిజాం పీచ‌మ‌ణిచి హైద‌రాబాద్‌ ను భార‌త‌దేశంలో విలీనం చేశారు. అయితే ఈ చ‌ర్యను విలీనం అనాలా...విద్రోహం అనాలా..తెలంగాణ‌కు స్వాతంత్ర్యం ద‌క్కిన రోజుగా ప్ర‌క‌టించాలా అనే విష‌యంలో అనేక భిన్నాభిప్రాయాలు, పార్టీల వారి సొంత అభిప్రాయాలు ఉన్నాయి. టీఆర్ ఎస్ అధినేత‌, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉద్య‌మ కాలంలో సెప్టెంబ‌ర్ 17 తెలంగాణ విమోచ‌న దిన‌మ‌ని, ఆ రోజును అధికారికంగా జ‌ర‌పాల‌ని డిమాండ్ లు చేశారు. అయితే ఇపుడు ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత మాట మార్చారు. అది విమోచ‌న దినం కాద‌ని అంటున్నారు. అధికారికంగా జ‌ర‌పాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు. దీంతో తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాల‌న్నీ కేసీఆర్ తీరుపై మండిప‌డ్డాయి.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. హైదరాబాద్‌ రాష్ట్రాన్ని భారత్‌ యూనియన్‌ లో విలీనం చేసే క్రమంలో ప్రాణ త్యాగం చేసిన అమరులకు మోడీ నివాళి అర్పించారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 17న విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ఒక‌ ప్రకటన విడుదల చేసింది. ‘‘హైదరాబాద్ రాష్ర్టాన్ని భారత యూనియన్‌ లో విలీనం చేసే క్రమంలో ప్రాణాలను త్యాగం చేసిన వారికి వందనాలు’’ అని మోడీ పేర్కొన్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న సారాంశం ఉంది.

సెప్టెంబ‌ర్ 17న తెలంగాణ విమోచ‌న దినాన్ని అధికారికంగా నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేసిన కేసీఆర్ సీఎం అయి, ముఖ్య‌మంత్రి హోదాలో విలీన‌మా..విమోచ‌న‌మా అనేది కూడా ప్ర‌క‌టించకుండా...క‌నీసం ఆ రోజును కూడా స్మ‌రించుకోకుండా ఇంట్లోనే తిష్ట‌వేసుకొని ఉంటే...మోడీ స్పందించ‌డం...అదికూడా నివాళి అర్పించ‌డం ఖ‌చ్చితంగా కేసీఆర్‌ కు ఝ‌ల‌క్ వంటిదేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.