Begin typing your search above and press return to search.

చాయ్ అమ్ముకున్నా.. దేశాన్ని కాదు!

By:  Tupaki Desk   |   27 Nov 2017 10:27 AM GMT
చాయ్ అమ్ముకున్నా.. దేశాన్ని కాదు!
X
గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మ‌రింత హీటెక్కించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. నీతి - నైతిక‌త‌ - నేత లేని పార్టీ కాంగ్రెస్ అని మండిప‌డ్డారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. గుజరాత్ తన మాతృభూమి అని, ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి తన జీవితం మొత్తాన్ని అర్పిస్తానని మోడీ అన్నారు. `ఓ పేదోడు ప్రధానమంత్రి కావడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. అవును నేను పేదవాడినే. నేను చాయ్ అమ్ముకున్నా. కానీ దేశాన్ని కాదు` అంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడూ గుజరాత్‌ను మోసం చేస్తూనే ఉన్నదని ఆయన అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటేనని మోడీ విమర్శించారు.

పటేళ్లకు రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ మాటలు విని మోసపోవద్దంటూ ప్ర‌ధాన‌మంత్రి పిలుపునిచ్చారు. జన సంఘ్ మద్దతుతోనే పటేల్ సామాజిక వర్గానికి చెందిన బాబుభాయ్ పటేల్ సీఎం అయ్యారని మోడీ గుర్తు చేశారు. దీనిని జీర్ణించుకోలేని కాంగ్రెస్.. ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టిందని ఆరోపించారు. సౌరాష్ట్రకే చెందిన కేశుభాయ్ పటేల్ సీఎం అయినప్పుడు కూడా కాంగ్రెస్ ఆయనను గద్దె దించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించిందని, ఆనందిబెన్ పటేల్ విషయంలోనూ ఇదే జరిగిందని మోడీ ఆరోపించారు. గుజరాత్ సంస్కృతి, సాంప్రదాయాలను కాంగ్రెస్ మంటగలపకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని ఈ సందర్భంగా మోడీ పిలుపునిచ్చారు. అన్ని సమస్యలకు అభివృద్ధే పరిష్కారమని, ఆ అభివృద్ధి కొనసాగుతూనే ఉండాలని ఆయన అన్నారు.

తనపై బుదర జల్లినందుకు సంతోషమని, ఎందుకంటే కమలం బురదలోనే వికసిస్తుందని కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. పదవి కోసం ఇక్కడ లేమని, ఇండియాను అత్యున్నత శిఖరాలకు చేర్చడమే తన లక్ష్యమని మోడీ స్పష్టంచేశారు. గుజరాత్ తన ఆత్మ అయితే.. భారత్ పరమాత్మ అని అన్నారు. `2008లో ముంబై దాడులు, తర్వాత ఉరి దాడి జరిగింది. ఈ రెండు దాడుల తర్వాత ఏ ప్రభుత్వం ఎలా స్పందించిందో చూస్తే కాంగ్రెస్ గురించి మీకు తెలిసిపోతుంది. పాకిస్థాన్ కోర్టు అక్కడి ఉగ్రవాదిని రిలీజ్ చేస్తే కాంగ్రెస్ పండుగ చేసుకుంటోంది. ఇదే కాంగ్రెస్ మన ఆర్మీని నమ్మలేదుగానీ.. చైనా రాయబారిని విశ్వసించింది` అంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. గత 15 ఏళ్లలో తాను సాధించిందంతా గుజరాత్ వల్లే సాధ్యమైందని మోదీ స్పష్టంచేశారు. సర్దార్ పటేల్‌ను కాంగ్రెస్ అవమానించినా గుజరాత్ ప్రజలు భరించారు. ఇక వాళ్ల ఆత్మ గౌరవంపై దాడిని ఏమాత్రం సహించలేరు అని అన్నారు. గుజరాత్ ఎప్పటికీ కాంగ్రెస్‌ను క్షమించదని ఆయన తేల్చి చెప్పారు. గుజరాత్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ సరిగా చూడలేదని, ఈ రాష్ట్రం వెనుకబడాలన్నదే వాళ్ల లక్ష్యమని విమర్శించారు.