Begin typing your search above and press return to search.

మోడీజీ మ‌న‌కు ఇంకో ఆఫ‌ర్ ఇస్తున్నారు

By:  Tupaki Desk   |   7 Nov 2016 6:09 AM GMT
మోడీజీ మ‌న‌కు ఇంకో ఆఫ‌ర్ ఇస్తున్నారు
X
సినీన‌టుల‌కు పెద్ద పీట వేసే రాజ‌కీయాల‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెక్ పెట్టారు. ఇన్‌ క్రెడిబుల్ ఇండియా ప్రచారకర్తగా ఇకపై బాలీవుడ్‌ తారలను నియమించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. తాజాగా అపూర్వ భారత్‌ (ఇన్‌ క్రెడిబుల్‌ ఇండియా) ప్రచారకర్తగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నియమిస్తూ కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యాటకులను ఆకర్శించడంలో మోడీనే సరైన వ్యక్తి అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి మనీశ్‌ శర్మ అభిప్రాయపడ్డారు. గత రెండున్నరేళ్లుగా ప్రధాని మోడీకి వివిధ దేశాల నుంచి వ‌స్తున్న స్పంద‌న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

ఇప్పటివరకు అపూర్వభారత్‌ ప్రచారకర్తగా బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన గడువు ముగిసిన తర్వాత ఆ స్థానంలో మరొకరిని కేంద్రం నియమించలేదు. అనంతరం అమితాబచ్చన్‌ - ప్రియాంక చోప్రాల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేయవచ్చనే వార్తలు వెలువడ్డాయి. అయితే అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటులను నియమించే విధానానికి తాజాగా కేంద్రం స్వస్తి పలికింది. విదేశీ పర్యాటకులను ఆకర్శించడంలో మోడీని మించిన వ్యక్తి దేశంలో ఎవరూ లేరని పర్యాటక శాఖ మంత్రి మనీశ్‌ శర్మ అభిప్రాయపడ్డారు. ప్రధానిగా మోడీ ఇప్పటి వరకు పర్యటించిన దేశాల నుంచి పర్యాటకుల తాకిడి పెరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అమెరికా - జెర్మనీ - ఫిజి - బ్రెజిల్‌ - ఆస్ట్రేలియా - యూకే - కెనడా - మయన్మార్‌ - వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులు దేశంలో పర్యటిస్తున్నట్టు పర్యాటక శాఖ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.

ఈ నిర్ణ‌యంలో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి మోడీ పలు సందర్భాల్లో దేశంలో ప్రసంగించిన పలు అంశాలను హై లైట్‌ చేస్తూ రేడియోలోనూ, టీవీ మాధ్యమాల్లోనూ ఉపయోగపడేలా, ఆడియో - వీడియో ఫుటేజీలతో ప్రకటనలను రూపొందించాలని పర్యాటక మంత్రిత్వశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఫుటేజీలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. నవంబర్‌ చివరి నుంచి ప్రారంభమై 40-45 రోజులు కొనసాగే పర్యాటక సీజన్‌ వరకు వాటిని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. దీనిద్వారా క్రిస్‌మస్‌, కొత్త సంవత్సర వేడుకలకు విదేశీయులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/