Begin typing your search above and press return to search.

మమత ప్రమాణానికి ముగ్గురు ప్రధానులు

By:  Tupaki Desk   |   22 May 2016 6:06 AM GMT
మమత ప్రమాణానికి ముగ్గురు ప్రధానులు
X
పశ్చిమ బెంగాల్‌ అధికార పీఠాన్ని అధిరోహిస్తూ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మమతా బెనర్జీ ఆ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 211 స్థానాలతో ఘన విజయం సాధించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమత ఈనెల 27న జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. తన పదవీ పట్టాభిషేకానికి రావల్సిందిగా జాతీయ - అంతర్జాతీయ - రాష్ట్ర స్థాయి నేతలను ఆహ్వానాలు పంపారు. మన ప్రధాని నరేంద్రమోడీతో సహా బెంగాల్ సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా - భూటాన్‌ ప్రధాని త్సెహరింగ్‌ టోబోగ్యేలనూ ఆమె ఆహ్వానించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీలను మమత ఆహ్వానించారు. ఇంకా యూపీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ - ఢిల్లి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ - బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ - తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత - ఆర్జేడీ అధ్యక్షుడు లల్లూ ప్రసాద్‌ యాదవ్‌ లకూ ఆహ్వానాలు పంపినట్లు టీఎంసీ నేతలు వెల్లడించారు.

కాగా రెండోసారి సాధించిన ఘన విజయం అనంతరం ఆమె తన ప్రమాణ స్వీకార వేదికను కూడా మారుస్తున్నారు. 2011లో మొదటిసారి సీఎంగా అధికారం చేపట్టిన మమత రాజ్‌ భవన్‌ లో ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి మాత్రం రాజ్‌ భవన్‌ లో కాకుండా ప్రజల సమక్షంలో రెడ్‌ రోడ్‌ లో చేయనున్నట్లు సమాచారం. రాజకీయ - క్రీడ - సినీ - పారిశ్రామిక ప్రముఖులకు ప్రమాణస్వీకారోత్సవ ఆహ్వానాలు పంపిన మమత వామపక్ష నేతలను మాత్రం పిలవలేదు. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ లెఫ్ట్‌ ను మట్టి కరిపించిన మమత తన ప్రమాణస్వీకారానికి సైతం వారిని దూరంగా ఉంచారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను తృణమూల్‌ కాంగ్రెస్‌ 211 సీట్లను గెలిచి అధికారం అందుకుంటున్నారు.

కాగా పశ్చిమబెంగాల్ పొరుగునే ఉన్న అస్సాంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న శర్వానంద సోనోవాల్ బంగ్లాదేశ్ తో ఘర్షణ వైఖరి అవలంబించేలా ఆ దేశంతో ఉన్న సరిహద్దును మూసేస్తామని ప్రకటిస్తుండగా బెంగాల్ సీఎం మమత మాత్రం బంగ్లాదేశ్ కు స్నేహహస్తం చాచుతూ ఆ దేశ ప్రధానిని తన ప్రమాణ స్వీకారోత్సవానికి పిలవడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో విపక్ష సీపీఎంను ఆహ్వానించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.