Begin typing your search above and press return to search.

102 పేరాల గోవా బ్రిక్స్ ప్రకటనలో ఏముంది?

By:  Tupaki Desk   |   17 Oct 2016 4:35 AM GMT
102 పేరాల గోవా బ్రిక్స్ ప్రకటనలో ఏముంది?
X
రెండు రోజుల బ్రిక్స్ సమావేశం ముగిసింది. ఒకప్పటి జాన్‌ జిగిరీ దేశమైన రష్యాకు పాత బంధాన్ని తన మాటలతో గుర్తు చేసిన ప్రధాని మోడీ.. ఉగ్రవాదానికి పుట్టినిల్లు తమ దేశానికి పొరుగునే ఉందన్న విషయాన్ని చెప్పేశారు. పాకిస్థాన్ పేరును ప్రస్తావించకున్నా.. ఆ దేశానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చేసిందని చెప్పిన ఆయన.. ఉగ్రవాదుల్ని తయారు చేసే వారికి వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాలు తమ ప్రజలకు భద్రత కల్పించే పనిలో భాగంగా అందరూ స్పందించాల్సిన సమయం ఆసన్నమైందన్న విషయాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు నాగరిక సమాజంలో ఒంటరి అవుతాయ‌న్న విషయాన్ని బ్రిక్స్ దేశాలు స్పష్టం చేయాలన్న విషయాన్ని ఆయన కోరారు.

ఉగ్రవాదంపై పోరాడేందుకు బ్రిక్స్ కూటమి కలిసికట్టుగా.. నిర్ణయాత్మకంగా పని చేయాలని అంగీకరించాం అంటూ అందరి మాటను తన మాటల్లో చెప్పిన మోడీ.. ఈ సందర్భంగా గోవా బ్రిక్స్ 102 పేరాల ప్రకటనను విడుదల చేశారు. ఇందులో ఐసిస్ గురించి ప్రస్తావించినప్పటికీ.. పాక్ లో పురుడు పోసుకొని పెద్దదైన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పేరును ప్రస్తావించకపోవటం గమనార్హం. బ్రిక్స్ కూటమి దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకనే ఆ పేరు ప్రస్తావించలేకపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. పఠాన్ కోట్.. ఉరీల్లో జరిగిన ఉగ్రదాడుల్ని ఖండించటం భారత్ వరకూ కాసింత ఓదార్పుగా చెప్పొచ్చు. బ్రిక్స్ కూటమి ఆమోదించిన 102 పేరాల్లో ఏముందన్న విషయాన్ని సంక్షిప్తంగా చూస్తే..

= ఉగ్రవాదుల్ని అన్ని కోణాల్లో కట్టడి చేయటం.. వారి శిబిరాల్ని ధ్వంసం చేయటం లాంటి అంశాలపై సమగ్ర విధానాన్ని అన్ని దేశాలు తీసుకురావాలి. ఇందుకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ఆమోదించాలని అన్ని దేశాల్ని కోరుతున్నాం. ఉగ్రవాద నిరోధక చర్యలన్నీ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉండాలి. మానవ హక్కులను గౌరవించాలి. బ్లాక్ మనీ.. హవాలా.. డ్రగ్స్ లాంటి వ్యవస్థీకృత నేరాలతో అందే ఉగ్రనిధుల కట్టడిపై దృష్టి పెట్టటంతో పాటు.. సోషల్ మీడియాతో సహా ఇంటర్నెట్ ను ఉగ్రవాద సంస్థలు దుర్వినియోగం చేయని రీతిలో ఉండాలి.

= మనీ లాండరింగ్.. ఉగ్రనిధుల విషయాల్ని ఎదుర్కోవటానికి బ్రిక్స్ కట్టుబడి ఉంది. ప్రపంచ శాంతి.. భద్రతలకు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవటానికి ఉమ్మడి చర్యల్ని మరింత పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక దేశాల్లో రాజకీయ.. భద్రతాపరమైన అస్థిరత రాజ్యమేలుతోంది. ఉగ్రవాదంతో ఇది మరింత తీవ్రమవుతోంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడం కోసం ఆయా దేశాల్లో పునర్‌నిర్మాణానికి తోడ్పాటు అందించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తిచేస్తున్నాం.

= ఆధునిక పన్ను విధానానికి కూటమి కట్టుబడి ఉంది. న్యాయబద్ధంగా.. అంతర్జాతీయంగా ఆమోదించిన ప్రమాణాల్ని అమలు చేసే విషయాన్ని స్వాగతిస్తున్నాం. అవినీతి కేసుల్లో నిందితులను అప్పగించి.. వారి ఆస్తుల స్వాధీనం లాంటి అంశాల్లో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవటం.. ఐక్యరాజ్యసమితి ఒప్పందం.. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అవినీతిని కట్టడి చేసే విషయంలో నిబద్ధత అవసరం. పారిస్ వాతావరణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం.

= పారిస్ ఒప్పందాన్ని అమలు చేయటంతో తలెత్తే నష్టాన్ని భర్తీ చేసుకోవటం కోసం వర్థమాన దేశాలకు సాయం అందించటం ద్వారా.. అభివృద్ధి చెందిన దేశాలు తమ బాధ్యతల్ని నెరవేర్చాలి. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌)సాయంగా నిలవాలి. కూటమిలోనిఐదు దేశాల ఆర్థిక వృద్ధిని కొలవడానికి ప్రత్యేక బ్రిక్స్‌ రేటింగ్‌ సంస్థ ఏర్పాటుకు అంగీకారం. బ్రిక్స్‌ మౌలికవసతుల ప్రాజెక్టు అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు నిర్ణయం. బ్రిక్స్ సభ్యదేశాల్లోని శాస్త్రవేత్తలు.. పరిశోధకులు.. క్రీడాకారులు.. కళాకారులు..సాంకేతిక నిపుణులు.. వ్యాపారవేత్తల మధ్య భాగస్వామ్యాల కోసం సంస్థాగత వేదికలని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం.

= బ్రిక్స్ సభ్య దేశాల మధ్య వాణిజ్య విధానాల్లో సమన్వయం కోసం.. వివిధ వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ప్రత్యేక వేదిక ఏర్పాటు. వ్యవసాయం.. వ్యవసాయ ఆధారిత వాణిజ్యంలో సభ్య దేశాల మధ్య సహకారాన్ని పటిష్ఠం చేసుకోవాలని నిర్ణయం. ఆయా దేశాల్లోని మెరుగైన వ్యవసాయ విధానాలను పరస్పరం తెలియజేసుకోవడానికి అంగీకారం. ఏడాదిలో 300 రోజుల పాటు సూర్యకాంతి అందుబాటులో ఉండే ప్రాంతాల్లో సౌర విద్యుత్‌ మౌలిక వసతులపై పెట్టుబడి పెట్టేందుకున్న అవకాశాలను పరిశీలించాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/