Begin typing your search above and press return to search.

కన్నడ ప్రజలూ.. మీ తీర్పు మోడీ చేతిలోనే..

By:  Tupaki Desk   |   15 May 2018 3:37 AM GMT
కన్నడ ప్రజలూ.. మీ తీర్పు మోడీ చేతిలోనే..
X
ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు వేసి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి.. అలా ఓట్లేసి గెలిపించిన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన అందించాలి. కానీ బీజేపీ పాలనలో ట్రైన్ రివర్స్ అవుతోంది. గడిచిన మూడేళ్లలో జరిగిన ఓ ఉత్తరఖండ్, గోవా, హర్యానా తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీకి మెజార్టీ రాకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమ పార్టీకి తక్కువ మెజార్టీ వచ్చినా సామధానబేధ దండోపాయాలు ప్రయోగించి ఆయా రాష్ట్రాలను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే..

మొన్నటికి మొన్న జయలలిత మరణానికి ముందు వరకూ బలంగా ఉన్న అన్నాడీఎంకేను టచ్ చేయడానికి కూడా మోడీ సాహసం చేయలేదు. కానీ అమ్మ మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలను మన మోడీజీ ఏ రేంజ్ లో ఆడుకున్నాడో తెలియంది కాదు.. ఇప్పటికీ తమిళనాట ప్రభుత్వాన్ని వెనుకుండి నడిపిస్తున్నది బీజేపీయేననేది జగమెరిగిన సత్యమే.. తమిళ ప్రజలు కూడా తమపై బీజేపీ పెత్తనాన్ని సహించకుండా ఆందోళనలు చేశారు..

ఇప్పుడు ఇదే పరిస్థితి కన్నడ నాట వచ్చే పరిస్థితి నెలకొంది. కన్నడ ప్రజలు తమ ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మెజార్టీని ఏదో పార్టీకి ఇస్తే వారి ప్రభుత్వం వారికుంటుంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే మాత్రం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయడానికి కుట్రదారులు రెడీగా ఉన్నారు. ఇప్పటికే హంగ్ ఏర్పడితే కీలకంగా ఉన్న జేడీఎస్ అధినేత కుమారస్వామి సింగపూర్ వెళ్లి లాలూచీ చర్చలు జరిపివచ్చారు. కాంగ్రెస్ కు మెజార్టీ రాకుండా హంగ్ ఏర్పడితే కర్ణాటకను చేజిక్కించుకోవడానికి బీజేపీ సర్వం సిద్ధం చేసింది. ఇలా ప్రజాతీర్పును తోసిరాజని అధికారబలంతో కర్ణాటకపై ఆధిపత్యానికి బీజేపీ రెడీ అవుతోంది. ప్రజాతీర్పును అపహాస్యం చేయడానికి కాచుకుకూర్చుందని అక్కడి సమీకరణాలను బట్టి అర్థమవుతోంది. మరి మరికొన్ని గంటల్లో తేలనున్న ఈ ఫలితంపైనే అందరి చూపు నెలకొంది.