Begin typing your search above and press return to search.

పాక్ ఎన్నికల్లో మోడీ పోటీ చేస్తారా?

By:  Tupaki Desk   |   26 Sep 2016 7:47 AM GMT
పాక్ ఎన్నికల్లో మోడీ పోటీ చేస్తారా?
X
ఇలాంటి సందేహాలు రాజకీయ పార్టీలకే వస్తాయేమో. విషయం సున్నితంగా ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా నోరు పారేసుకోవటం ఏ మాత్రం మంచిది కాదు. ఉరీ ఉగ్ర ఘటన నేపథ్యంలో పాక్ విషయంలో రియాక్ట్ కావాల్సిన తీరు అంత సింపులేం కాదు. ఆచితూచి అడుగు వేయాలి. ఎవరో కొందరి భావోద్వేగాల కోసం యుద్ధాన్ని కోట్లాది మంది మీద రుద్దకూడదు. పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పుడు యుద్ధం గురించిన ఆసక్తి కొందరిలో వ్యక్తమవుతుంటుంది. అలాంటి వారు యద్ధం వస్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? యుద్ధ ఫలితం ఎలా ఉన్నా.. సగటు జీవి పరిస్థితులు ఏమిటన్న విషయాన్ని దూరదృష్టితో ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు.

ఆధునిక ప్రపంచంలో యుద్ధం అంటే బస్తీమే సవాల్ కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందులోకి బాధ్యత తెలియని శత్రువుతో వార్ అంటే మరీ ప్రమాదకరం. ఆచితూచి అడుగు వేయకపోతే.. ద‌శాబ్దాల తరబడి ప్రజలు దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఈ విషయంలో ముందుచూపు లేకుండా వ్యవహరిస్తే జరిగే నష్టం అపారం. యుద్ధం అన్ని సమస్యలకు పరిష్కారం కాదన్న విషయాన్ని మర్చిపోకూదు. ఒక అడుగు వెనక్కి వేయటం చేతకానితనం అనుకునే కన్నా.. అది వ్యూహంలో భాగంగా ఫీలయ్యే లక్షణం కాంగ్రెస్ లో కొరవడినట్లుగా కనిపిస్తోంది.

పాక్ వైఖరిని తీవ్రంగా తప్పు పడుతూనే.. దాయాది దేశం యుద్ధం చేయాల్సింది ఏ అంశాల మీదనో కోజికోడ్ వేదికగా మోడీ చేసిన ప్రసంగాన్ని మర్చిపోకూడదు. అందరి మనసుల్ని సమాధానపర్చటంతో పాటు.. మోడీ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయని..తొందరపాటుకు కిలోమీటర్ల దూరంలో ఆయన ఉన్న విషయం స్పష్టమైంది. ఒకవైపు యుద్ధానికి సన్నద్ధం అవుతున్న వార్తల నేపథ్యంలో మోడీ నోటి నుంచి వచ్చిన మాటలు పలువురిని ఆశ్చర్యచకితుల్ని చేయటంతో పాటు.. మోడీ పరిణితి మీద జాతి జనుల్లో సంతృప్తి వ్యక్తమైంది.

ఇదిలా ఉంటే..మోడీ మాటలు కాంగ్రెస్ కు ఏ మాత్రం నచ్చనట్లుగా కనిపిస్తోంది. అందుకే.. వ్యూహాత్మకంగా చేసిన మోడీ ప్రసంగాన్ని ఎటకారం చేసుకునేందుకు ప్రయత్నించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి మనీశ్ తివారీ మాట్లాడుతూ.. భారతీయుల ఆగ్రహ జ్వాలలు అర్థం చేసుకోకుండా.. పాక్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిలా ఎద్దేవా చేశారు. పేదరికం.. నిరుద్యోగాన్ని నిర్మూలించటంలో పోటీకి సిద్ధం కావాలంటూ పాక్ ను మోడీ విసిరిన సవాలును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

అభివృద్ధి ఫలాల ఆవశ్యకత గురించి పాక్ ప్రజలకు బోధించటాన్ని మోడీ షురూ చేశారన్న మనీశ్.. మోడీ మాటల్ని సానుకూల దృష్టితో చూడలేదన్న విషయం అర్థమవుతుంది. భారత్ ఎప్పుడూ బాధ్యతగా వ్యవహరిస్తుందే తప్పించి.. స్వల్పకాలిక‌ ప్రయోజనాల మీద దృష్టి పెట్టదన్న భావ‌న‌కు తగ్గట్లే మోడీ వ్యవహరించారే తప్పించి.. దూకుడుగా.. దుందుడుకుగా వ్యవహరించలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. రాజకీయాలు వేరు.. యుద్ధం వేరు. ఒక దేశం మీద యుద్ధాన్ని ప్రకటించటం చాలా తేలికే. కానీ.. ఆ తర్వాత ఎదుర‌య్యే పరిస్థితుల్ని ఎదుర్కోవటమే అసలుసిసలు సవాలు. ఆ విషయం మీద మనీశ్ పెద్దగా దృష్టి పెట్టలేదన్నట్లుగా కనిపిస్తోంది.