Begin typing your search above and press return to search.

మాయ చేసేలా.. మనిషి అద్భుత సృష్టి మస్దర్

By:  Tupaki Desk   |   18 Aug 2015 5:40 AM GMT
మాయ చేసేలా.. మనిషి అద్భుత సృష్టి మస్దర్
X
యూఏఈకి వెళ్లిన ప్రధాని మోడీ ఒక నగరాన్ని సందర్శించటం కోసం మస్దర్ అనే నగరాన్ని సందర్శించారు. ఒక దేశ ప్రధాని విదేశీ పర్యటనలో ఎంత బిజీబిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది మోడీ మస్దర్ నగరాన్ని సందర్శించాలని ఎందుకనుకున్నారు? దానికి కారణం ఏమిటన్న విషయాలు చూస్తే.. నోట మాట రాని పరిస్థితి. మానవ సాంకేతిక సృష్టి ఏ స్థాయిలో ఉంటుందో చాటి చెప్పే నగరం మస్దర్.

ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాలన్న ఉద్దేశ్యంతో యూఏపీ పాలకులు అబుదాబిలో ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక నగరాన్ని నిర్మించాలని నిర్ణయించారు. 2006లో మొదలు పెట్టిన ఈ నగర నిర్మాణం మొత్తం 2020 నాటికి కానీ 2025 నాటికి పూర్తయ్యే వీలుందని చెబుతున్నారు. ఇప్పటికే తొలిదశను పూర్తి చేసుకున్న ఈ నగరం ప్రత్యేకతలు వింటే నోట మాట రాని పరిస్థితి. ఈ అద్భుత నగరాన్ని నిర్మించేందుకు దాదాపుగా రూ.1.15లక్షల కోట్లు ఖర్చు అవుతాయని చెబుతున్నారు.

మస్దర్ ప్రత్యేకతలు చూస్తే..

= ఈ నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉండవు. ఆ మాటకు వస్తే రోడ్లే ఉండవు.

= ఈ సిటీలో మొత్తం రహదారుల్ని భూగర్భంలో ఏర్పాటు చేశారు.

= కాలుష్యం అన్న మాట లేకుండా చేసేందుకు సోలార్ తో నడిచే వాహనాల్ని మాత్రమే ఉపయోగిస్తారు.

= ఈ నగరంలోని వారికి సొంత వాహనాలు అన్నవి ఉండవు.

= ఈ నగరంలో వినియోగించే వాహనాలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండేవే.

= ఈ కారణంతో కాలుష్యం అన్నది కనిపించదు.

= ప్రపంచంలోనే తొలి పొల్యూషన్ ఫ్రీ సిటీగా పేరొందింది.

= ప్రస్తుతం ఈ సిటీలో నాలుగు వేల మంది నివసిస్తున్నా.. మొత్తం 50వేల మంది నివసించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

= అరబ్ దేశాల్లో ఎండలు మండిపోవటం తెలిసిందే. దీన్ని అధిగమించేందుకు సిటీ మొత్తం చల్లబర్చేందుకు పెద్ద పెద్ద బ్లోయర్లు ఏర్పాటు చేశారు.

= భవనాల్ని దగ్గర.. దగ్గరగా నిర్మించటంతోపాటు.. మొత్తం విద్యుత్తును సౌర.. పవన సాయంతోనే ఉత్పత్తి చేయటం గమనార్హం.

= ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్లనే.. అరబ్ దేశాలతో పోలిస్తే.. ఈ నగరంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.

= ఈ నగరంలో పెట్టుబడి పెట్టే సంస్థలకు పన్నులు ఏమీ లేకుండా ఉండటం మరో ప్రత్యేకత.

= నిర్మాణం పూర్తి కాకముందే ఇన్ని విశేషాలున్న ఈ నగరం నిర్మాణం పూర్తి అయితే సాంకేతిక స్వర్గంగా మారే వీలుంది.