Begin typing your search above and press return to search.

మోడీ మ‌హా ప్లాన్‌.. టార్గెట్ సౌత్‌..ఎలానంటే?

By:  Tupaki Desk   |   29 Jan 2019 4:52 AM GMT
మోడీ మ‌హా ప్లాన్‌.. టార్గెట్ సౌత్‌..ఎలానంటే?
X
2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని ఒక్క‌సారి గుర్తు తెచ్చుకోండి. బీజేపీ అద్భుత విజ‌యానికి కార‌ణం దేశ వ్యాప్తంగా వివిద రాష్ట్రాల్లో బీజేపీకి ల‌భించిన ఆద‌ర‌ణ అనుకుంటే పొర‌పాటే. వాటితో పాటు.. యూపీలో ల‌భించిన అద్భుత విజ‌యం కూడా కార‌ణం. ఆ మాట‌కు వ‌స్తే.. యూపీలో బీజేపీ ఖాతాలో ప‌డిన ఎంపీ సీట్ల‌తో ఎన్డీయేలోని కూట‌మి ప‌క్షాల అవ‌స‌రం లేకుండానే.. త‌మ సొంత బ‌లంతోనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ప‌రిస్థితి మోడీకి ద‌క్కింది.

ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర ఐదేళ్లు నిండ‌నున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేశాయి. మ‌రో నెల వ్య‌వ‌ధిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. ఐదేళ్ల క్రితం దేశంలో ఏ మూల‌కు వెళ్లినా.. మోడీ.. మోడీ అంటూ నినాదాలు వినిపించేవి. ఇప్పుడు అదే స్థానంలో మోడీ మీద ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్న ప‌రిస్థితి. బీజేపీకి భారీ మెజార్టీని తెచ్చి పెట్టిన యూపీలో అయితే బీజేపీ ప‌రిస్థితి ఏ మాత్రం బాగోలేదు.

మోడీపై క‌త్తి క‌ట్టిన ఆ రాష్ట్రానికి చెందిన ముఖ్య‌మైన పార్టీలు స‌మాజ్ వాదీ (ఎస్పీ).. బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ)లు రెండు జ‌త క‌ట్టి.. మ‌రికొన్ని చిన్న పార్టీల‌తో క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డి పోటీ చేయ‌నున్నాయి. దీంతో.. బీజేపీకి భారీ దెబ్బ త‌గ‌ల‌టం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. దీనికి తోడు ఇటీవ‌ల వెల్ల‌డైన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల్లో బీజేపీ దారుణంగా దెబ్బ తిన‌టంతో.. త‌మ‌కు అండ‌గా నిలిచే రాష్ట్రాల అవ‌స‌రం బీజేపీకి ఇప్పుడు అత్య‌వ‌స‌ర‌మైంది.

యూపీలో దెబ్బ పడే ప‌క్షంలో దాదాపు 80 సీట్ల వ‌ర‌కూ న‌ష్ట‌పోయే ప‌రిస్థితి. మ‌రి.. ఈ డ్యామేజ్ కంట్రోల్ కు మోడీ బ్యాచ్ స‌రికొత్త ప్లాన్ సిద్ధం చేసిన‌ట్లు చెబుతున్నారు. యూపీ మాదిరి బీజేపీకి అండ‌గా నిలిచే ప్రాంతం దేశంలో మ‌రెక్క‌డా లేద‌ని.. ద‌క్షినాది మాత్ర‌మే దిక్కుగా గుర్తించారు. దీంతో.. బీజేపీ పెద్ద‌ల దృష్టి ఇప్పుడు సౌత్ మీద ప‌డింది.

మొద‌ట్నించి సౌత్ లో త‌మ స‌త్తా చాటాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా క‌మ‌ల‌నాథుల ఖాతాలో సౌత్ ప‌డింది లేదు. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు కూడా. అందుకే ప్లాన్ బిని తెర మీద‌కు తెచ్చింది మోడీ బ్యాచ్‌.

త‌న కొత్త వ్యూహంలో భాగంగా ద‌క్షిణాదిన ఉన్న ఐదు రాష్ట్రాలు.. ఒక కేంద్ర‌పాలిత ప్రాంతం మీద బీజేపీ దృష్టి సారించింది. ఈ మొత్తంలో 120 ఎంపీ స్థానాలు ఉన్న నేప‌థ్యంలో.. ఇక్క‌డి ప్రాంతీయ పార్టీల అండ‌తోత‌మ ఖాతాలోకి 80 స్థానాల్ని సొంతం చేసుకున్నా.. కేంద్రంలో తాము ప‌వ‌ర్లోకి రావ‌టానికి మార్గం ఈజీ అవుతుంద‌న్న ఆలోచ‌న‌లో క‌మ‌ల‌నాథులు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

సౌత్ లో క‌ర్ణాట‌క త‌ప్పించి మ‌రే రాష్ట్రంలోనూ బీజేపీకి బ‌లం లేని ప‌రిస్థితి. ఈ ఇబ్బందిని అధిగ‌మించ‌టంలో భాగంగా ద‌క్షిణాదిన మీద దృష్టి సారించిన మోడీ.. మొన్న ఆదివారం కేర‌ళ‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించి.. అయ్య‌ప్ప ఎపిసోడ్‌లో అక్క‌డి క‌మ్యునిస్ట్ స‌ర్కారు త‌ప్పు చేసిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేసి కేర‌ళీయుల మ‌న‌సు దోచుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇదే తీరులో త‌మ‌కు తెర‌చాటుగా మ‌ద్ద‌తు ప‌లికే రాష్ట్రాల్లో ఆయా పార్టీల మీద ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌కుండా ఎన్నిక‌ల ర‌థాన్ని ముందుకు తీసుకెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో మోడీ ఉన్న‌ట్లు చెబుతున్నారు. సౌత్ మీద ఆశ ప‌డిన ప్ర‌తిసారీ బీజేపీకి ఎదురుదెబ్బ త‌గిలిన ట్రాక్ రికార్డు ఉన్న నేప‌థ్యంలో.. తాజా ప్లాన్ ఎంత‌వ‌ర‌కు వ‌ర్క్ వుట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.