Begin typing your search above and press return to search.

బీఎస్పీ పేరును మోదీ మార్చేశారుగా!

By:  Tupaki Desk   |   26 Feb 2017 11:09 AM GMT
బీఎస్పీ పేరును మోదీ మార్చేశారుగా!
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఇప్ప‌టికే మెజార్టీ స్థానాల‌కు పోలింగ్ యుగియ‌గా... తుది విడ‌త పోలింగ్ కు ఎన్నిక‌ల సంఘం స‌ర్వం సిద్దం చేసింది. ఈ క్ర‌మంలో అక్క‌డ ప్ర‌చారంలో పాల్గొంటున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ - యూపీ సీఎం - స‌మాజ్ వాదీ పార్టీ యువ‌నేత అఖిలేశ్ యాదవ్‌ - యూపీ మాజీ సీఎం - బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి త‌దిత‌రులు త‌మ‌దైన శైలిలో వైరి వ‌ర్గాల‌పై సెటైర్లేస్తున్నారు.

నిన్న‌టిదాకా ఎస్పీ - కాంగ్రెస్ పార్టీల‌నే ప్ర‌ధాన ల‌క్ష్యంగా చేసుకున్న మోదీ... బీఎస్పీని అంత‌గా టార్గెట్ చేయ‌లేదు. తాజాగా బీఎస్పీకి కూడా టార్గెట్ చేసిన మోదీ... ఆ పార్టీ పేరునే మార్చేశారు. బీఎస్పీ అంటే బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ. అయితే ప్రస్తుతం మ‌నం చూస్తున్న బీఎస్పీ పేరు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ కాద‌ని పేర్కొన్న... పార్టీ విధానాలు మారిన నేప‌థ్యంలో ఆ పార్టీని బెహ‌న్జీ సంప‌త్తి పార్టీగా పిలిస్తే బాగుంటుంద‌ని ఆయ‌న సెటైర్ వేశారు. ఎక్క‌డ స‌భ పెట్టినా... చందాల రూపంలో భారీ ఎత్తున నిధుల‌ను సేక‌రిస్తున్న మాయావ‌తి వైఖ‌రిని తుల‌నాడుతూ మోదీ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా స‌మాచారం. మాయావ‌తిని బెహ‌న్జీగా అభివ‌ర్ణించిన మోదీ... ఆమెకు నిధుల‌ను స‌మ‌కూర్చిపెట్టే పార్టీగా బీఎస్పీ ఉంద‌ని అందుకే ఆ పార్టీని బెహ‌న్జీ సంప‌త్తి పార్టీగా మార్చాల్సి వ‌చ్చింద‌ని కూడా మోదీ వ్యాఖ్యానించారు.

మోదీ పేల్చిన ఈ సెటైర్ల‌కు జ‌నం నుంచి బాగానే స్పందన వ‌చ్చింది గానీ... ఎన్నిక‌ల్లో బీజేపీకి ఏ మేర‌కు ఓట్లు ప‌డ‌తాయ‌న్న అంశ‌మే ఇంకా తేల‌లేదు. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే నాలుగు విడ‌త‌ల పోలింగ్ ముగిసినా... ఇంకా అక్క‌డ ఏ పార్టీకి కూడా స్ప‌ష్ట‌మైన మెజార్టీ గాని, విజ‌యావ‌కాశాలు ఖాయ‌మైన దాఖ‌లా క‌నిపించ‌లేదు. ఓట్ల లెక్కింపు పూర్త‌య్యే దాకా కూడా ఈ ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశ‌ముంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌తి ఎన్నిక‌లోనూ యూపీ ప్ర‌జ‌ల మూడ్‌ను ప‌సిగ‌ట్టేసిన స‌ర్వేలు.. ఈ దఫా మాత్రం ఏ ఒక్క స‌ర్వే సంస్థ‌కు కూడా యూపీ ప్ర‌జ‌ల నాడి అంద‌డం లేదు. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/