Begin typing your search above and press return to search.

ప్ర‌తి వీకెండ్ లోనూ క‌ర్ణాట‌క‌కు మోడీ !

By:  Tupaki Desk   |   25 Dec 2017 5:52 AM GMT
ప్ర‌తి వీకెండ్ లోనూ క‌ర్ణాట‌క‌కు మోడీ !
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్యూహం చాలామందికి అర్థం కాని రీతిలో ఉంటాయ‌ని చెబుతారు. కానీ.. నిశితంగా చూస్తే.. ఆయ‌న మైండ్‌ సెట్ ను కొద్దిమేర అర్థం చేసుకునే అవ‌కాశం ఉంటుంది. విడిగా ఏ రాష్ట్రం మీదా ప్ర‌త్యేక దృష్టిని సారించ‌ని మోడీ.. ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే చాలు.. స‌ద‌రు రాష్ట్రం మీద శ్ర‌ద్ధ‌.. ప్రేమాభిమానాల్ని కిలోల లెక్క‌న ప్ర‌ద‌ర్శిస్తుంటారు.

ప్ర‌ధాన‌మంత్రిగా మోడీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొత్త‌ల్లో జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు రావ‌టం గుర్తుందా? ఎన్నిక‌లు ప్రారంభం కావ‌టానికి కొన్ని నెల‌ల ముందు నుంచే ప్ర‌తి ఆదివారం క‌శ్మీర్ లో ఏదో ఒక స‌భ ఏర్పాటు చేయ‌ట‌మో.. కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌ట‌మో చేసేవారు. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న ఏ ప్ర‌ధాని కూడా క‌శ్మీర్‌ కు అన్నిసార్లు వెళ్ల‌లేదు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో చాలా ఎక్కువ‌సార్లు క‌శ్మీర్‌ కు వెళ్లిన మోడీ తాను అనుకున్న‌ది కొంత‌మేర సాధించారు. పూర్తి మెజార్టీని సాధించ‌న‌ప్ప‌టికీ.. క‌శ్మీర్ రాష్ట్రంలో మ‌రో మిత్రుడితో క‌లిసి.. అధికారాన్ని పంచుకోవ‌టంలో స‌క్సెస్ అయ్యారు.

ఎన్నిక‌లు పూర్తి అయి.. ఫ‌లితాలు వెల్ల‌డైన త‌ర్వాత నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ క‌శ్మీర్‌ కు మోడీ ఎన్నిసార్లు వెళ్లారో చూస్తే.. విష‌యం అర్థం కావటంతో పాటు.. మోడీ మైండ్ సెట్ ఏమిట‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. క‌శ్మీర్ మొద‌లు మొన్న ముగిసిన గుజ‌రాత్‌.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ రాష్ట్రాల వ‌ర‌కూ ఇదే వ్యూహం మోడీలో క‌నిపిస్తుంది. రానున్న కొద్ది నెల‌ల్లో క‌ర్ణాట‌క అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో మోడీ క‌న్ను క‌ర్ణాట‌క మీద ప‌డుతుంద‌న‌టంలో సందేహం లేదు.

ద‌క్షిణాది లో బీజేపీ పాగా వేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న క‌మ‌ల‌నాథుల‌కు.. ఎంత క‌ష్ట‌ప‌డినా వారి ఆశ‌లు ఫ‌లించ‌టం లేదు. ఇప్పుడు వారికి ఉన్న ఒకే ఒక్క ఆశ‌.. క‌ర్ణాట‌కగా చెప్పాలి. ఇప్ప‌టికే ఒక‌సారి ఆక్క‌డ త‌మ జెండా ఎగుర‌వేసిన బీజేపీ.. స్వ‌ప‌క్షంలోని అస‌మ్మ‌తితో అధికారాన్ని చేజార్చుకుంది. ఈసారి అలాంటి త‌ప్పున‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా క‌ర్ణాట‌క‌లో కాషాయ జెండా ఎగుర‌వేసేందుకు ప‌క్కా ప్లాన్ ను మోడీ అండ్ కో సిద్ధం చేస్తోంది.

అయితే.. ఈ ప్లాన్ లో మోడీదే కీ రోల్ గా చెబుతున్నారు. క‌ర్ణాట‌క‌లో కాషాయ జెండా ఎగుర‌వేయ‌టానికి వీలుగా మోడీని స్వ‌యంగా రంగంలోకి దించాల‌న్న ఆలోచ‌న‌కు మోడీ సైతం ఓకే చెప్పేసిన‌ట్లుగా చెబుతున్నారు. క‌ర్ణాట‌క‌లో పాగా వేయ‌టం ద్వారా.. ద‌క్షిణాదిలోనూ తాము ప్ర‌భావాన్ని చూపించ‌గ‌ల‌మ‌న్న సానుకూల సందేశాన్ని పంపించిన‌ట్లు అవుతుంద‌ని భావిస్తున్నారు. ఇది 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంతోకొంత క‌లిసి వ‌స్తుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. సో.. రానున్న రోజుల్లో ప్ర‌తి వీకెండ్ కు క‌ర్ణాట‌క‌కు ప్ర‌ధాని రావ‌టం మొద‌ల‌వుతుందన్న మాట‌. క‌ర్ణాట‌క‌లో కాషాయ జెండా ఎగిరే వ‌ర‌కూ మోడీ యాత్ర‌లు నిర్విరామంగా సాగ‌నున్నాయి.