Begin typing your search above and press return to search.

తెలంగాణలో మోడీ టూర్ ఫిక్స్

By:  Tupaki Desk   |   23 July 2016 12:24 PM IST
తెలంగాణలో మోడీ టూర్ ఫిక్స్
X
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి స్వదేశంలోని పలు రాష్ట్రాల్లో రెండు మూడుసార్ల కంటే ఎక్కువ సార్లు.. డజన్ల కొద్దీ విదేశీ పర్యటనలు.. ఇక అమెరికా అధినేత ఒబామాతో అయితే మూడు.. నాలుగు సార్ల వరకూ భేటీ అయిన మోడీ.. తెలంగాణ రాష్ట్రానికి ఒక్కసారంటే ఒక్కసారి కూడా రాకపోవటం మర్చిపోకూడదు. భారతదేశంలో మరే ప్రధాని వెళ్లనంత తరచుగా కశ్మీర్ రాష్ట్రానికి వెళ్లిన ప్రధాని.. ఢిల్లీకి 45 నిమిషాల విమాన ప్రయాణం దూరంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోకి మాత్రం అడుగు పెట్టకపోవటం గమనార్హం.

సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. అనంతరం ఆయన సర్కారు తెలంగాణలో అధికారపక్షంగా అవతరించిన నేపథ్యంలో మోడీ హైదరాబాద్ రావటానికి సుముఖతను వ్యక్తం చేయనట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు.. కేసీఆర్ తో సంబంధాలు ఏ మాత్రం బాగోలేకపోవటం.. ఆయనకు ఆయన తనను ఆహ్వానించేంత వరకూ తెలంగాణ రాష్ట్రానికి వెళ్లకూడదని అనుకున్నారేమో కానీ.. ఆయన ఇంతకాలం వరకూ తెలంగాణ స్టేట్ కు రాలేదు. ఇదిలా ఉంటే.. మొన్నటికి మొన్న తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీతో ఏకాంతంగా భేటీ అయిన కేసీఆర్.. ప్రధాని మోడీని తెలంగాణ స్టేట్ కు ఆహ్వానించటం.. ఆయన తమ రాష్ట్రానికి రావాలంటూ నోరార పిలిచి.. పలు కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కోరిన నేపథ్యంలో ఆయన ప్రోగ్రాం కన్ఫర్మ్ కావటం గమనార్హం.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించిన కొద్ది రోజులకే మోడీ తెలంగాణ టూర్ ప్రోగ్రామ్ దాదాపుగా ఫిక్స్ అయ్యాయి. వచ్చే నెల 7న ఆయన హైదరాబాద్ కు వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఓకే చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న మిషన్ భగీరధ కార్యక్రమాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించారు. దీనికి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కోమటిబండ గ్రామం వేదిక కానుంది. ఇవి కాక.. వరంగల్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే ప్రత్యేక హెల్త్ వర్సిటీ బిల్డింగ్.. టెక్స్ టైల్ పార్కులకు శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమాల్లో మోడీ అటెండ్ కానున్నారు. పాతిక నెలల తర్వాత వస్తున్న మోడీ.. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ స్థాయిలో స్వాగతం పలుకుతారో చూడాలి.