Begin typing your search above and press return to search.

మోడీ టూర్ వెనుక ఇంకో ప్ర‌త్యేక‌త

By:  Tupaki Desk   |   6 Aug 2016 10:56 AM GMT
మోడీ టూర్ వెనుక ఇంకో ప్ర‌త్యేక‌త
X
తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారిగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ ఈనెల ఏడవ తేదీన రాష్ట్రంలో పర్యటించనున్నారు. అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మాన‌స పుత్రిక - తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని గజ్వేల్‌ లో ప్రారంభించనున్నారు. గజ్వేల్‌ లో నియోజ‌క‌వ‌ర్గం సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సెగ్మెంట్ అనే సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఆగస్టు 7 ప్రపంచ స్నేహితుల దినోత్సవం. ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టివ‌ర‌కు అర‌కొర మిత్రుత్వం ఉన్న మోదీ-కేసీఆర్‌ ల మ‌ధ్య ఈ బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని చెప్తున్నారు.

మిష‌న్ భ‌గీర‌థ పథకం ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. ప్ర‌ధాన‌మంత్రి సార‌థ్యంలోని నీతి ఆయోగ్ సైతం అన్ని రాష్ట్రాలకు ఈ పథకాన్ని పరిశీలించాలని, తమతమ రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించింది. ప్రధానమంత్రి సైతం ఈ పథకంపై ఆసక్తి చూపడంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ లోనే ఈ పథకాన్ని ప్రధానమంత్రితో ప్రారంభోత్సవం చేయించాలని నిర్ణయించారు. ఈ క్ర‌మంలోనే తాజా ప‌ర్య‌ట‌న‌లో గజ్వేల్‌ లో ఈ పథకాన్ని ప్రారంభించి తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని - పథకాలను ప్రధాని వివరిస్తారు.

ఇదిలాఉండ‌గా తెలంగాణ ఏర్పాటులో విపక్షంగా బీజేపీ సహకరించినా - నరేంద్ర మోదీ మాత్రం తెలంగాణపై ఇప్పటివరకు బహిరంగంగా సానుకూలత వ్యక్తం చేయలేదు. పైగా సార్వ‌త్రిక‌ ఎన్నికల సమయంలో ఆంధ్రలో చంద్ర‌బాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ బలవంతంగా తల్లీబిడ్డను వేరు చేశారని విమర్శలు చేశారు. తాజాగా ప్రత్యేక హోదా కోసం ఆంధ్రలో ఆందోళనలు సాగుతున్న సమయంలో మోదీ తెలంగాణ పర్యటన ఆసక్తి కలిగిస్తోంది. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని బీజేపీపై అధికారంలో ఉన్న టీడీపీ విమర్శలు ఎక్కుపెట్టిన సమయంలో మోదీ తెలంగాణ పర్యటనలో ఇచ్చే హామీలు, చేసే ప్రకటనలపై రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన పలు హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని తెలంగాణ నాయకత్వం ఇప్పటి వరకు విమర్శిస్తూ వచ్చింది. తాజా ప‌ర్య‌ట‌న‌లో వీటిపై ప్ర‌ధాన‌మంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మ‌రి. మొత్తంగ మోడీ ప‌ర్య‌ట‌న రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ‌ను రేకెత్తిస్తోంది.