Begin typing your search above and press return to search.

మోడీతో నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె ట్విట్టర్‌ స్నేహం

By:  Tupaki Desk   |   10 April 2015 4:18 AM GMT
మోడీతో నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె ట్విట్టర్‌ స్నేహం
X
భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య సంబంధాల గురించి కొత్తగా చెప్పేదేం లేదు... పాకిస్థాన్‌ లో పాలకులు మారినా... భారత్‌ లో ప్రధానాలు మారినా రెండు దేశాల సంబంధాలలో మాత్రం పెద్దగా మార్పులు రావు. అయితే.... భారత్‌ లో గత ఏడాది మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత భారీ మార్పులు వస్తాయని అంతా భావించారు. పాకిస్థాన్‌ తో యుద్ధానికి కాలు దువ్వుతారనీ భావించారు. అయితే, మోడీ అందుకు భిన్నంగా తన ప్రమాణ స్వీకారానికి నవాజ్‌ షరీఫ్‌ ను పిలవడం... ఆయన రావడం తెలిసిందే. పోనీ ఆ సంఘటనతో స్నేహం పెరుగుతుందా అనుకుంటే అలా కూడా జరగలేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు.

ఈ పరిస్థితుల్లో రీసెంట్‌ గా యెమన్‌ దేశంలో అంతర్యుద్ధం రెండు దేశాల మధ్య అనుకోని పరిస్థితిని కల్పించింది. యెమన్‌ లో చిక్కుకున్న తమతమ దేశాల ప్రజలను అన్ని దేశాలూ వెనక్కు తీసుకొస్తున్నాయి. భారత్‌, పాకిస్థాన్‌ లు కూడా తమ ప్రజలను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకొస్తున్నాయి. ఇందులో వింతేమీ లేకపోయినా తాజాగా పాకిస్థాన్‌ తమ ప్రజలను తీసుకొచ్చేటప్పుడు 11 మంది భారతీయులను కూడా తీసుకొచ్చి మనదేశానికి సురక్షితంగా పంపే ఏర్పాట్లు చేసింది. ఈ సంఘటన పాకిస్థాన్‌ లోని రెండో పార్శ్వాన్ని చూపించిందని విశ్లేషకులు కొందరు అంటున్నారు. అయితే... సంబంధాలు, సమస్యలు ఎలా ఉన్నా ఈ ఒక్క సంఘటనను ఆధారంగా చేసుకుని పాకిస్థాన్‌ చేసిన మంచిపనికి మన ప్రధాని మోడీ ఆ దేశానికి కృతతలు చెప్పారు.

పాకిస్థాన్‌ ఔదార్యంపై మోడీ ట్విట్టర్‌ లో బుధవారం ధన్యవాదాలు పాకిస్తాన్‌ సహకారంతో వచ్చిన భారత్‌కు చెందిన పదకొండు మంది సిటిజన్స్‌కు స్వాగతం పలుకుతున్నానని, ఇందుకు తాను పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు ధన్యవాదాలు చెబుతున్నానని, షరీఫ్‌దీ మానవతా దృక్పథమని కొనియాడారు. సేవ చేసేందుకు ఎలాంటి హద్దులు ఉండవని షరీఫ్‌ నిరూపించారని మోడీ ట్వీట్‌ చేశారు.

అయితే... మోడీ ట్వీట్‌ కు పాకిస్తాన్‌ వైపు నుంచి అనుకోని స్పందన వచ్చింది. పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తరఫున ఆయన కూతురు మరియమ్‌ నవాజ్‌ షరీఫ్‌ మోడీ ట్వీట్‌ కు స్పందించారు. మోడీ స్పందనకు మా కృతతలు... మా భారత స్నేహితులు భద్రంగా ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉంది.. మానవత్వం మనల్ని ఒకటి చేస్తుంది అంటూ ట్వీట్‌ చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మోడీ ట్వీట్‌ కు స్పందించడం సంతోషకరమైన పరిణామమే.