Begin typing your search above and press return to search.

మోడీకి తెలిసొచ్చింది.. తెలివొచ్చింది..

By:  Tupaki Desk   |   6 Jun 2018 4:24 AM GMT
మోడీకి తెలిసొచ్చింది.. తెలివొచ్చింది..
X
ఎట్టకేలకు మోడీ మారాడు.. ఇన్నాళ్లు నేల విడిచి సాము చేసిన దానికి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు తత్త్వం బోధపడింది. పెట్టాల్సింది కార్పొరేట్లకు కాదు.. కష్టజీవులకు అని తెలిసివచ్చింది. అందుకే ఇప్పుడు పేదల ప్రయోజనం చేకూర్చే సామాజిక భద్రత పథకాలకు తాజాగా రూపకల్పన చేస్తున్నాడు..

సీఎం కేసీఆర్ కు ప్రజల పల్స్ తెలుసు. అందుకే ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో బాగా ఆలోచించే దేశంలోనే ఎవ్వరూ కలలో కూడా ఊహించని పథకాలను ప్రవేశపెడుతున్నాడు. ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాడు. కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై పక్కనే ఉన్న మహారాష్ట్ర రైతులు కూడా తమను తెలంగాణలో కలపాలని అడిగారంటే ఆయన స్టామినా అర్థం చేసుకోవచ్చు..

సంక్షేమ రాజ్యంలో మోడీ డిజిటల్ ఇండియా అంటూ నాలుగేళ్లుగా తప్పటడుగులు వేసి దెబ్బైపోయారు. ఇప్పుడు చేతులు కాలాక.. బీజేపీ గద్దెకు బీటలు వారాక దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నిన్న బీజేపీ కురువృద్ధులు అడ్వాణీ - మురళీ మనోహర్ జోషీలను షరణు వేడిన మోడీ.. నేడు వినూత్నంగా అందరు పేదలకు లబ్ది చేకూర్చే.. దాదాపు దేశంలోని 50 కోట్ల మందికి కవరయ్యే విధంగా సామాజిక భద్రత పథకాలను ప్రారంభించనున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం..

ఎన్నికలలోపు దేశంలోని దాదాపు 4 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా సామాజిక భద్రత పథకాన్ని అమలు చేయాలని.. 2019లోపు దేశవ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తున్నారు. తొలుత వృద్ధాప్య పింఛన్లు - జీవిత బీమా - ప్రసూతి పథకాలను ప్రకటించాలని మోడీ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇలా అధికారంలోకి వచ్చిన కొత్తలో చేయాల్సిన పనులన్నీ చివరలో చేస్తున్న మోడీకి అంతిమంగా ప్రయోజనం దక్కుతుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే.