Begin typing your search above and press return to search.

వారి మనసు దోచుకోవటానికి మోడీ ఎంతగా శ్రమిస్తున్నారంటే?

By:  Tupaki Desk   |   21 Oct 2019 5:39 AM GMT
వారి మనసు దోచుకోవటానికి మోడీ ఎంతగా శ్రమిస్తున్నారంటే?
X
టార్గెట్ పెట్టుకోవటం వేరు. దాన్ని సాధించే వరకూ శ్రమించటం వేరు. చాలామంది మొదటిదానితోనే ఆగిపోతారు. కొందరు మాత్రం రెండోది పూర్తి అయ్యే వరకూ వదిలిపెట్టరు. ప్రధాని మోడీ రెండో కోవకు చెందిన వారు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత.. ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నింటిని వాడేస్తారు. అవసరమైతే విమర్శలకు తావిచ్చే తోవలో వెళ్లేందుకు సైతం వెనుకాడరు. గమ్యాన్ని చేరిన తర్వాత.. తన లక్ష్య కాంక్ష ఎంత బలమైనదన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేస్తుంటారు.

తాజాగా అలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు మోడీ. తమిళుల మనసు దోచుకోవాలన్న ప్రయత్నం ఇప్పటిది కాదు. ఏళ్లకు ఏళ్లు గడిచినా.. తమిళుల కోసం ఆయన ఎంత ప్రయాస పడినా.. ఆయాసం తప్పించి ఆయనకు దక్కిందేమీ లేదు. ఇప్పటివరకూ మరే రాష్ట్రం కోసం.. ఆ రాష్ట్ర ప్రజలు తన పట్ల పాజిటివ్ గా ఫీల్ కావటం కోసం ఇంత కష్టం ఎప్పుడూ పడింది లేదు.

చైనా అధ్యక్షుడి భారత్ పర్యటనకు తమిళనాడును ఎంచుకోవటమే కాదు.. తాను ఏకంగా రెండు రోజుల పాటు అక్కడే ఉండటం దగ్గర నుంచి.. అక్కడి స్థానిక చరిత్ర గురించి తనకున్న అవగాహన మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చేశారు. దేశంలో ఎన్నో సాగర తీరాలు ఉన్నా.. పని కట్టుకొని మరీ మహాబలిపురంలోని మామల్లపురం సముద్రం ఒడ్డున చెత్త ఏరేందుకు సైతం వెనుకాడలేదు.

అచ్చ తమిళుడి మాదిరి వస్త్రధారణతో పాటు..తనకు వీలు కుదిరిన ప్రతిసారీ తమిళ కవుల్లో ప్రముఖులైన వారి కొటేషన్లను ప్రస్తావించటం లాంటివెన్నో ప్రయత్నాలు చేశారు. మోడీ నుంచి ఇంత జరుగుతున్నా.. తమిళులు మాత్రం మోడీ మాదిరి అంతే పట్టుదలతో ఉన్నారు. మోడీని ఆమోదించేందుకు ససేమిరా అంటున్నారు. తమిళుల మనసుల్ని దోచుకోవాలన్న అంశంపై మోడీ ఎంత బలంగా ఉంటారో.. ఎవరైనా ఓకే మోడీ మాత్రం నో అన్నట్లుగా తమిళులు రియాక్ట్ అవుతుంటారు.

తాజాగా తాను మామల్లపురం సాగరంతో తాను జరిపిన సంభాషణను కవిత రూపంలో రాశారు. దాన్ని తాజాగా తమిళనంలో అనుమాదం చేసి మరీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తమిళ భాష ప్రాచీనమైనదిగా పేర్కొంటూ.. వారి గొప్పతనాన్ని తాను గుర్తించిన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.

మోడీ ఇంతలా ప్రయత్నిస్తున్నా.. తమిళులు మాత్రం మోడీ విషయంలో తమ మనసు మార్చుకునేది లేదన్నట్లుగా ఉండటం గమనార్హం. తాను కోరుకున్నది దక్కించుకునేంత వరకూ వదిలిపెట్టని మోడీ పట్టుదలకు తాము ఒకసారి బలంగా డిసైడ్ అయితే అంతే అన్నట్లు ఉండే తమిళుల ఫీలింగ్స్ కు మధ్య చోటు చేసుకున్న ప్రయత్నాల్లో ఎవరు నెగ్గుతారో.. ఎవరు తగ్గుతారో అన్నది ఆసక్తికరమనే చెప్పాలి.