Begin typing your search above and press return to search.

ఇప్పుడు మోడీకి సొంతూరు ఎందుకు గుర్తుకొచ్చింది?

By:  Tupaki Desk   |   9 Oct 2017 5:20 AM GMT
ఇప్పుడు మోడీకి సొంతూరు ఎందుకు గుర్తుకొచ్చింది?
X
ప్ర‌ధాని మోడీ మైండ్ సెట్ కాస్త టిపిక‌ల్ అంటుంటారు. కానీ..ఆయ‌న్ను ద‌గ్గ‌ర నుంచి ట్రాక్ చేస్తే.. ఆయ‌న కొన్ని వ్యూహాలు ఒకేలా క‌నిపిస్తాయి. మూడున్న‌రేళ్లుగా ప్ర‌ధాని సీట్లో కూర్చున్న ఆయ‌న ఒక విష‌యంలో మాత్రం ఎప్పుడూ ఒకేలాంటి ఎత్తుగ‌డ‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఏదైనా రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌స్తుంటే చాలు.. ఏడాది ముందు నుంచే అలెర్ట్ అయిపోతారు.

ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఆయ‌న ఛాలెంజ్‌గా తీసుకున్న జ‌మ్ముకశ్మీర్ రాష్ట్ర ఎన్నిక‌లు. ఆ ఎన్నిక‌ల్లో ఏది ఏమైనా కాషాయ‌జెండా ఎగుర‌వేయాల‌న్న త‌ప‌న ఆయ‌న‌లో క‌నిపించింది. దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న ఠంచ‌నుగా కశ్మీర్ వెళ్లేవారు. అక్క‌డ స‌భ‌ల్లో మాట్లాడేవారు. కశ్మీర్‌కు వ‌రాల మీద వ‌రాలు కురిపించారు. మోడీ క‌ష్టానికి త‌గ్గ‌ట్లే గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్ల‌ను గెల్చుకోవ‌ట‌మే కాదు.. పొత్తుల‌తో సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగారు.

ఒక్క‌సారి ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత అప్ప‌టివ‌ర‌కూ హై ప్ర‌యారిటీని ప్ర‌ద‌ర్శించిన క‌శ్మీర్‌ను ఆయ‌న వ‌దిలేశారు. అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు ఎంత త‌ర‌చుగా క‌శ్మీర్ వెళ్లేవారో.. ఎన్నిక‌లు పూర్తి అయిన త‌ర్వాత ఆ రాష్ట్రాన్ని ప‌ట్టించుకోవ‌ట‌మే మానేశారు. ఇందుకు సొంత రాష్ట్రం కూడా మిన‌హాయింపేమీ కాదేమో.

ఒక టీ అమ్మిన కుర్రాడు సైతం ఈ దేశ ప్ర‌ధాని కాగ‌ల‌డు. ప్ర‌ధాని కుర్చీ కొన్ని కుటుంబాల‌కు మాత్ర‌మే చెందింద‌న్న‌ది త‌ప్పు అంటూ.. త‌న గ‌తాన్ని క‌థ‌లా చెప్పి దేశ ప్ర‌జల్ని భావోద్వేగానికి గురి చేసి మ‌రీ.. త‌న‌ను ప్ర‌ధానిగా ఎన్నుకునేలా చేయ‌టంలో మోడీకి సాయంగా నిలిచిన ఊరు ఏమైనా ఉందంటే అది గుజ‌రాత్ లోని మోడీ సొంతూరు వ‌డ్ న‌గ‌ర్‌. మ‌రికొద్ది నెల‌ల్లో (ఈ ఏడాది చివ‌ర్లో) గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌.. సొంతోళ్ల మ‌న‌సుల్ని దోచుకునే ప్రోగ్రామ్‌ను షురూ చేశారు మోడీ.

ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న మూడున్న‌రేళ్లకు మోడీకి సొంతూరు గుర్తుకొచ్చింది. అది కూడా ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగా కావ‌టం గ‌మ‌నార్హం. అయితేనేమి.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌ట‌మే కాదు.. అక్క‌డి మ‌ట్టిని నుదిటిన సింధూరంగా రాసుకొని సొంతోళ్ల మ‌న‌సుల్ని దోచుకున్నారు. ప్ర‌ధాని అయ్యాక సొంతూరుకు రావ‌టానికి ఇంత‌కాలం ప‌ట్టిందా? అన్న సందేహాన్ని త‌న చేష్ట‌ల‌తో చెరిపేశార‌ని చెప్పాలి. సొంతూరు ప్ర‌జ‌ల ప్రేమాభిమానాలు.. భోలేనాథుడి ఆశీస్సుల‌తోనే తానింత స్థాయికి చేరుకున్న‌ట్లుగా చెప్పుకున్నారు.

కాన్వాయ్‌ ను వ‌దిలి.. త‌న‌ను చూసేందుకు వ‌చ్చిన ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యారు. ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న త‌మ వాడ్ని చూసుకునేందుకు స్థానికులు భారీగా పోటెత్తారు. ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. వ‌డ్ న‌గ‌ర్ రైల్వేస్టేష‌న్లోనే మోడీ చిన్న‌త‌నంలో ఛాయ్ అమ్మారు. తాను చ‌దువుకున్న స్కూల్కు వెళ్ల‌టంతో పాటు.. త‌న‌తో మాట్లాడిన వారంద‌రిని చూస్తుంటే త‌న బాల్యం గుర్తుకొచ్చింద‌ని చెప్పుకున్నారు.

త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సొంతూరుకు కొన్ని వ‌రాలు ఇచ్చారు మోడీ. కొత్త‌గా క‌ట్టిన మెడిక‌ల్ కాలేజీని స్టార్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి మెడిక‌ల్ స్టూడెంట్స్‌తో మాట్లాడారు. అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన మోడీ తన ప్ర‌యాణం వ‌డ్ న‌గ‌ర్ నుంచి మొద‌లై కాశీకి చేరుకున్నాడ‌న‌ని.. వ‌డ్ న‌గ‌ర్ మాదిరే కాశీ కూడా భోలేనాథుడి (శివుడ్ని అలా కూడా పిలుస్తుంటారు) క్షేత్రంగా చెప్పారు. శివుడు ఇచ్చిన శ‌క్తితోనే తన‌కు విషాన్ని జీర్ణించుకునే శ‌క్తి వ‌చ్చింద‌న్నారు. ఈ ఆశీర్వాదం కార‌ణంగానే 2001 నుంచి త‌న‌పై విషం చిమ్ముతున్న వారంద‌రికి స‌మాధానం ఇస్తున్న‌ట్లుగా చెప్పుకున్నారు. వ‌డ్ న‌గ‌ర్ త‌న‌కు గ‌ర‌ళాన్ని కంఠంలో దాచుకోవ‌టాన్ని నేర్పింద‌న్నారు. దేశంలో ఏ చిన్నారి నిర్మూల‌న సాధ్య‌మైన వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉండేందుకు వీలుగా విస్తృత టీకా ప‌థ‌కాన్ని వ‌డ్ న‌గ‌ర్ నుంచి స్టార్ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రెండేళ్ల లోపు వ‌య‌సున్న ప్ర‌తి చిన్నారికీ.. వ్యాధి నిరోధ‌క టీకాలు తీసుకోని గ‌ర్బిణులంద‌రికి టీకాలు వేయ‌నున్నారు. దేశ వ్యాప్తంగా 173 జిల్లాలు.. 17 న‌గ‌రాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. 2020 నాటికి దేశంలోని అంద‌రి చిన్నారుల‌కు వ్యాధినిరోధ‌క టీకాల్నివేయాల‌న్న‌ది లక్ష్యంగా పెట్టుకున్నారు.