Begin typing your search above and press return to search.

నిన్న గవర్నర్...ఇపుడు మోడీ... ?

By:  Tupaki Desk   |   4 Feb 2022 11:46 AM GMT
నిన్న గవర్నర్...ఇపుడు మోడీ... ?
X
ఆయన ప్లాన్స్ ఏంటో ఎవరికీ తెలియవు కానీ తీరు చూస్తే ఆగ్రహం మాత్రం ఆకాశాన్ని అంటుతోంది అంటున్నారు. అది కూడా బీజేపీ మీద, కేంద్రంలో రాజ్యం చేసేవారి మీద ఒక లెవెల్ లో తన ఆవేశాన్ని ప్రకటిస్తున్నారు కేసీయార్. ఇక కేంద్రం ద్వారా నియమించబడిన రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై విషయంలో కూడా ఆయన ఎందుకో దూరం పాటిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన రిపబ్లిక్ డే వేళ రాజ్ భవన్ కి వెళ్లకుండా కేసీయార్ ప్రగతి భవన్ లోనే జెండా ఎగరేసిన సంగతి విధితమే.

అదే కేసీయార్ తాజాగా మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని టాక్ నడుస్తోంది. శ్రీ రామానుజాచార్యుల సహస్రబ్ది ఉత్సవాలలో పాలు పంచుకునేందుకు హైదరాబాద్ కి ఈ నెల 5న వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు కేసీయార్ వెళ్లకూడదని కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు.

ఈ మధ్య కేంద్రంతో వివాదాలు తలెత్తిన నేపధ్యంతో పాటు, కేంద్ర బడ్జెట్ మీద కేసీయార్ నిప్పులు చెరిగి మరీ తన ఆవేశాన్ని అంతా చూపించిన క్రమంలో మోదీకి స్వాగతం పలకరాదు అని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. నిజానికి ఈ మధ్య దాకా కేసీయార్ మోడీని ఢిల్లీ వెళ్ళి కలవడం అనేక అంశాల మీద చర్చలు జరపడం చేసేవారు.

అదే విధంగా ప్రధాని హైదరాబాద్ వస్తే ఆయనకు స్వాగతం పలికేవారు. ఇవన్నీ రాజ్యాంగం ప్రకారం పాటించాల్సిన ప్రోటోకాల్. ఇందులో ఎవరికీ అభ్యంతరాలు ఉండరాదు, కానీ ఇపుడు రాజకీయాలు రూటు మార్చుకుంటున్నాయి. దాంతో రాజ్యాంగం ప్రకారం జరిగే సున్నితమైన భేటీలు కూడా వాటిలో పడి నలిగిపోతున్నాయి. అదే విధంగా చూసుకుంటే పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ కి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య హాట్ హాట్ గానే ఎపుడూ వాతావరణం ఉంటుంది.

అంత వరకూ కధ లేకపోయినా తెలంగాణాలో చూస్తే గవర్నర్ తో టీయారెస్ పెద్దలకు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంటున్నారు. ఇపుడు అది కాస్తా ముందుకెళ్ళి ప్రధాని తమ సొంత రాష్ట్రానికి వచ్చినా స్వాగతం పలకపోవడం అంటే ఆలోచించాలి. ఇదిలా ఉంటే కేసీయార్ స్థానంలో తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారని ఈ మేరకు సీఎం కార్యాలయం వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీంతో ఇపుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. చూడాలి మరి ఇది ఎంతవరకూ వెళ్తుందో. రాజకీయ రచ్చ ఏ రేంజిలోకి సాగుతుందో.