Begin typing your search above and press return to search.

ఒకే కారులో మోడీ ఇవాంకా

By:  Tupaki Desk   |   27 Nov 2017 8:40 AM GMT
ఒకే కారులో మోడీ ఇవాంకా
X
హైద‌రాబాద్ వేదిక‌గా సాగ‌నున్న గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఈ స‌దస్సుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య‌...ప్రభుత్వ సలహాదారు ఇవాంక ట్రంప్ హాజ‌ర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే హైద‌రాబాద్ టూర్ సంద‌ర్భంగా న‌గ‌రానికి వ‌స్తున్న మోడీ, ట్రంప్ ఒకే కారులో పర్య‌టించ‌నున్నార‌ట‌. అదే స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ప్ర‌త్యేకంగా ముచ్చ‌ట్లు సాగ‌నున్నాయ‌ని స‌మాచారం.

హెచ్‌ఐసీసీలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజ‌ర‌య్యేందుకు ప్ర‌ధాన‌మంత్రి నరేంద్రమోడీ మంగళవారం మధ్యాహ్నం 1-20 గంటలకు హైదరాబాద్ రానున్న సంగ‌తి తెలిసిందే. మెట్రోరైల్‌ను ప్రారంభించిన త‌ర్వాత‌ హెచ్‌ఐసిసి ప్రాంగణానికి హెలికాప్టర్‌లో రానున్నారు. ఇందుకోసం హెచ్‌ఐసీసీ వెనక హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడి నుంచి నరేంద్రమోడీ నేరుగా నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. 3-20 గంటల నుంచి 3-45 గంటల వరకు మోడీ, ఇవాంక ముఖాముఖి సమావేశం కానున్నారు. ఇందుకోసం ఈ హోటల్‌లోని మొదటి అంతస్థులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హెచ్‌ఐసిసితో పాటు నోవాటెల్‌ హోటల్‌ను అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్ల తమ ఆధీనంలోకి తీసుకుని నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. మోడీ, ఇవాంక చర్చలు జరిపే సమయంలో ఇతరులు ఎవరినీ అనుమతించరాదని నిర్ణయించారు.

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ప్ర‌సంగం అనంత‌రం ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో ఇచ్చే విందుకు ఇవాంకా ట్రంప్‌, ప్ర‌ధాని మోడీ ఒకే కారులో వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది. రాత్రి 7.30కి హెచ్ఐసీసీ నుంచి రోడ్డు మార్గంలో ఫలక్ నుమా ప్యాలెస్‌కు ఒకే కారులో ఈ ఇద్ద‌రు ప్ర‌ముఖులు బయలుదేరే అవ‌కాశం ఉంద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. అనంత‌రం ఇవాంక ట్రంప్ తో పాటు గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు హాజరయ్యే ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం ఫలక్ నుమా ప్యాలెస్ లో ఇచ్చే విందులో పాల్గొంటారు. రాత్రి 10 గంటల వరకు ఫలక్‌నుమా ప్యాలెస్ లోనే ఉంటారు. ఈ సంద‌ర్భంగా ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్ నుంచి హైద‌రాబాద్ న‌గ‌ర అందాల‌ను వీక్షిస్తార‌ని తెలుస్తోంది. అనంత‌రం 10.25కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని ఢిల్లీ వెళ్లిపోతారు.