Begin typing your search above and press return to search.

వైసీపీలో జూ.ఎన్టీఆర్ మామకు కీలక పదవి

By:  Tupaki Desk   |   11 March 2019 7:51 AM GMT
వైసీపీలో జూ.ఎన్టీఆర్ మామకు కీలక పదవి
X
జూనియర్ ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి దక్కింది. ఇటీవలే వైసీపీలో చేరిన ఆయనకు జగన్ అత్యున్నత పదవిని కట్టబెట్టారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు నార్నే శ్రీనివాసరావును పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా నియమించారు. ఈ విషయాన్ని వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈయనతోపాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ కూడా చేరారు. ఆయనకు వైసీపీ టికెట్ కేటాయిస్తుందని సమాచారం.

ఈసారి ఎన్నికల వేళ.. నార్నే శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వతహాగా ఈయన అల్లుడు హీరో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి చెందిన వారే.. చంద్రబాబు కూడా నార్నేకు అత్యంత సన్నిహితులు. అసలు ఎన్టీఆర్ కు నార్నే శ్రీనివాసరావు తన కూతురు లక్ష్మీ ప్రణతిని ఇచ్చి వివాహం చేయించడంలో చంద్రబాబే కీలక పాత్రధారి అని వార్తలొచ్చాయి. అంతటి సన్నిహితుడైన చంద్రబాబును వదిలి నార్నే శ్రీనివాసరావు వైసీసీ చేరడమే పెద్ద సంచలనమైంది. మామ వైసీపీలో చేరడంతో అల్లుడు ఎన్టీఆర్ మద్దతుపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ నా దారి వేరు.. అల్లుడికి సంబంధం లేదని నార్నే క్లారిటీ ఇచ్చారు. జగన్ వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వైసీపీ చేరానని వివరణ ఇచ్చారు. ఆది నుంచి తాను వైఎస్ కుటుంబానికి మద్దతుదారుడినని చెప్పుకొచ్చారు. ఇలా వైసీపీలో చేరిన ఎన్టీఆర్ మామకు ఇప్పుడు జగన్ కీలక పదవి కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది.