Begin typing your search above and press return to search.

యూపీలో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి జీవీఎల్...?

By:  Tupaki Desk   |   25 Dec 2022 9:32 AM GMT
యూపీలో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి జీవీఎల్...?
X
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీల్ నరసింహారావు పెద్ద నోరు చేస్తున్నారు. ఏపీ అభివృద్ధి బీజేపె బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా ఆయన భారీ ప్రకటనలు ఇస్తున్నారు. అయితే విజయవాడ లేకపోతే విశాఖపట్నం అన్నట్లుగా మీడియా ముందు కూర్చుని జీవీఎల్ వల్లించే ప్రగతి పాఠాలు వినేవారిని వీనుల విందుగానే ఉంటాయి. కానీ అసలు మ్యాటర్ చూస్తే వీక్ అనే సెటైర్లు పడుతున్నాయి.

ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం టన్నులకు టన్నులు అభివృద్ధిని ఏపీ మీద కుమ్మరిస్తూంటే అందుకోలేని నిస్సహాయతతో ఏపీ పార్టీలు పాలకులు ఉన్నట్లుగా జీవీఎల్ ఇస్తున్న కలరింగ్ మీద అయితే అంతా వెటకారమే చేస్తున్నారు. ఇంతకీ జీవీఎల్ చెప్పేదేంటి అంటే మేము అన్నీ ఇచ్చేస్తున్నాం, మేము ఎంతో చేసేస్తున్నాం, అసమర్ధత అంతా ఏపీ ప్రభుత్వాలదే అని నిందలేస్తున్నారు.

మరి వాస్తవంగా చూస్తే అలా ఉందా అన్నదే ఇక్కడ కీలకమైన మౌలికమైన ప్రశ్న. జీవీఎల్ తాజాగా అన్న మాటలు చూస్తే వింతగా ఉన్నాయని అంటున్నారు. ఏపీకి ఒక్క ఐటీ పరిశ్రమ రాలేదని జీవీఎల్ విమర్శలు సంధించారు. ఓడిన తరువాత చంద్రబాబు హైదరాబాద్ కే వెళ్లారని, రేపటి రోజున జగన్ ఓడినా అక్కడికే వెళ్తారని జీవీఎల్ అంటున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఏపీకి చేసిందేమీ లేదు అని దుయ్యబెట్టారు జీవీఎల్.

ప్రత్యేకించి ఐటీ పరిశ్రమల విషయంలో అసలు శ్రద్ధ చూపించడంలేదు అని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఏపీలో జీవీఎల్ ఉంటున్నారా అన్నది ఒక ప్రశ్న వస్తోంది. ఆయన కూడా ఢిల్లీ నుంచే వచ్చీ పోతున్నారు కదా అని అంటున్నారు. అలాగే ఆయన తన వైపు తప్పు ఉంచుకుని ఎవరూ ఏపీలో ఉండడంలేదు అని అనడం ఎంతవరకూ సమంజసం అన్నది కూడా జనాల నుంచి వస్తున్న సందేహం. అలాగే మోడీ అమిత్ షా  కూడా ఎక్కడ ఉన్నారు అని కూడా అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే జీవీఎల్ ఏపీలో ఒక్క ఐటీ కంపెనీ రాలేదు అంటున్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా నెగ్గిన ఉత్తరప్రదేశ్ లో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయో చెప్పగలరా అని ఏపీ జనం నుంచే కీలకమైన ప్రశ్న వస్తోంది. అదే విధంగా ఏపీకి ఎంతో చేశామని చెప్పుకుంటున్న బీజేపీ పెద్దలు ఏపీకి ప్రత్యేక హోదా ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి జవాబు చెప్పగలరా అని కూడా నిలదీస్తున్నారు.

విభజన తరువాత ఏపీకి ప్రధాని అభ్యర్ధి హోదాలో వచ్చిన నరేంద్ర మోడీ కానీ బీజేపీ నేతలు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు. మరి ఈ రోజు వాటి సంగతేంటి, అందులో ఎన్ని అమలుకు నోచుకున్నాయో జీవీఎల్ చెప్పగలరా అంటే జవాబు ఉందా. ఇక దేశంలో చూసుకున్నా బీజేపీ నల్లధనాన్ని వెనక్కి తెస్తామని ప్రతీ ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయల దాకా వేస్తామని చెప్పుకొచ్చింది.

మరి తొమ్మిదేళ్ళ పాలనకు చేరువ అవుతున్నా ఇంతవరకూ ఆ హామీ సంగతి ఏమైందో చెప్పగలరా జీవీఎల్ సార్ అంటే ఏమంటారో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏపీ విభజన తరువాత దారుణంగా మారి కునారిల్లుతూంటే కనీసంగా కూడా పట్టించుకోని బీజేపీ పెద్దలు ఇపుడు తాపీగా వచ్చి మీడియా ముందు ప్రెస్ మీట్లు పెడుతూ ఏపీకి ఆ కంపెనీ ఎందుకు రాలేదు, ఈ ఐటీ కంపెనీ ఎందుకు రాలేదు అంటే జనాలకు ఒక రేంజిలో చిర్రెత్తుకుపోతోంది అంటున్నారు.

జీవీఎల్ ప్రత్యేక హోదా కేంద్రం తో ఒప్పించి ఏపీకి ఇప్పిస్తే ఒక్క ఐటీ కంపెనీ లేంటి చాలా పరిశ్రమలు వస్తాయి. మరి ఆ సంగతి తెలిసి కూడా తాను ఏమీ ఎరగనట్లుగా అంతా ఏపీ ముఖ్యమంత్రులే చేశారని నిందలేయడం, ప్రత్యర్ధి పార్టీల మీద పడి ఏడ్వడం కంటే లేకితనం ఏముంటుంది అంటున్నారు. సో జీవీఎల్ ఏపీ అభివృద్ధికి చేతనైతే చేయండి, కానీ ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు చేసే ముందు ఒకటికి పదిసార్లు బీజేపీ కూడా ఏమి చేసిందో చెప్పి మాట్లాడాలనే అంతా అంటున్నారు.