Begin typing your search above and press return to search.

అంతరిక్షంలోఉన్న అమెరికన్స్ ఓట్లు ఎలా?

By:  Tupaki Desk   |   8 Nov 2016 6:39 AM GMT
అంతరిక్షంలోఉన్న అమెరికన్స్ ఓట్లు ఎలా?
X
డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ - రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠం కోసం రసవత్తర పోరు సాగుంతుంది. ఈ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి జనాలు ఫుల్ హుషారుగా సిద్దపడుతుండగా... ఇప్పటికే సుమారు నాలుగుకోట్ల మంది ముందస్తు ఓటింగ్ వేసేశారు. ఇక మిగిలినవారు నేడు జరిగే పోలింగ్ లో పాల్గొంటున్నారు. అమెరికాలో ఉన్న ముస్లింలు ఓటు వేయొద్దని ఉగ్రవాద సంస్థలు హెచ్చరించినా అవి వారి చైతన్యాన్ని ఆపవనే అంటున్నారు! సరే భూమిపై ఉన్న వారు ఎలాగోలా తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. మరి భూమికి వేల మైళ్ల దూరంలో అంతరిక్షంలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి?

అలాంటి అనుమానాలు ఏమీ అక్కరలేదంటూ ఇద్దరు అమెరికన్ వ్యోమగాములూ అంతరిక్షం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేన్ కిమ్ బ్రో వ్యోమగామి అధికారికంగా తన ఓటు హక్కును ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి వినియోగించుకున్నట్టు నాసా ప్రకటించింది. ఇదే క్రమంలో మరో వ్యోమగామి కేట్ రాబిన్స్ కూడా తను భూమిపైకి వచ్చే వారం ముందు అంతరిక్షం నుంచి ఓటు వేసినట్టు ఆ సంస్థ తెలిపింది.

ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే... ఎన్నికలు ప్రారంభమవడానికి సుమారు ఆరు నెలల ముందుకు వ్యోమగాములకు స్టాండర్డ్ ఫామ్ ఒకటి ఇస్తారు. అది ఓటర్ రిజిస్ట్రేషన్ - స్థలాంతర బ్యాలెట్ రిక్వెస్ట్ - ఫెడరల్ పోస్టు కార్డు అప్లికేషన్ అన్నమాట. దీంతో ఏ ఎలక్షన్ (స్థానిక / రాష్ట్ర / ఫెఢరల్) లో వారు ఓటుహక్కు వేయాలనుకుంటున్నారో తెలుపడంతో వ్యోమగాముల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. దీంతో అంతరిక్షం నుంచే వారంతా ఓటు వేయొచ్చన్నమాట!

కాగా 1997లో టెక్సాస్ చట్టసభలు ఈ బిల్లును పాస్ చేశాయి. అదే ఏడాది మొదటిసారి ఉపయోగించిన ఈ స్పేస్ ఓటింగ్ ను - నాసా వ్యోమగామి డేవిడ్ వోల్ఫ్ ముందుగా ఉపయోగించారు. దీంతో అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న మొదటి అమెరికన్ వ్యోమగామిగా ఆయన నిలిచారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/