Begin typing your search above and press return to search.

గ్రహాంతరవాసులపై త్వరలో నాసా ప్రకటన?

By:  Tupaki Desk   |   11 Dec 2017 12:13 PM GMT
గ్రహాంతరవాసులపై త్వరలో నాసా ప్రకటన?
X
జీవరాశికి భూమి ఒక్కటే ఆలవాలమా...? విశ్వంలో ఇంకెక్కడా జీవి అన్నది లేదా? ఏళ్లుగా శాస్ర్తవేత్తలను వేధిస్తున్న ప్రశ్న ఇది. అప్పుడప్పుడూ యూఎఫ్‌ బీలు - గ్రహాంతరవాసులు అంటూ అక్కడక్కడా వార్తలొచ్చినా దేనికీ ఆధారం లేదు. కానీ... తొలిసారి అలాంటి ఆధారాలు లభించినట్లు భావిస్తున్నారు. దీనిపై నాసా త్వరలో ప్రకటన చేయనుందని తెలుస్తోంది.

అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్రం నాసా చాలాకాలంగా చేస్తున్న పరిశోధనల్లో భాగంగా ఇతర గ్రహాల్లో ఉన్న జీవరాశి ఉనికిని గుర్తించినట్లు భావిస్తున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌పంచానికి వెల్లడించడానికి డిసెంబ‌ర్ 14న నాసా మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

కాగా కెప్ల‌ర్ టెలిస్కోప్ సాయంతో 2009 నుంచి ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్న శాస్త్ర‌వేత్త‌లు 2500కి పైగా భూమిని పోలిన గ్ర‌హాలను గుర్తించారు. ఇవన్నీ విశ్వంలో గోల్డీలాక్ జోన్‌ లో ఉన్న గ్రహాలు. ఆ జోన్‌ లో ఉన్న గ్రహాల్లో జీవరాశి మనుగడకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఆ గ్రహాల్లో ఒకదాంట్లో జీవరాశిని నాసా గుర్తించిందని భావిస్తున్నారు. ఈ ఏడాదే ఇందుకు సంబంధించిన ఆనవాళ్లు దొరికినా పూర్తిగా అన్ని రకాల ఆధారాలు సంపాదించాకే నాసా ఇప్పుడు ప్రకటించడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది.

అయితే.. డిసెంబరు 14న నాసా చేయబోయే ప్రకటనకు సంబంధించి ఆ సంస్థ నుంచి ఇంతవరకు ఎలాంటి సూచనలు రాలేదు. అమెరికన్ సైంటిఫిక్ సర్కిళ్లలో మాత్రం ఇది గ్రహాంతర జీవరాశి గురించే అన్న ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది.