Begin typing your search above and press return to search.

చంద్రుడిపై నివాసానికి సంబంధించి నాసా సంచలన ప్రకటన!

By:  Tupaki Desk   |   21 Nov 2022 10:33 AM GMT
చంద్రుడిపై నివాసానికి సంబంధించి నాసా సంచలన ప్రకటన!
X
చందమామపై నివాసం ఉండటం కోసం ఎప్పటి నుంచో మాన వులు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. భూమి విపరీతంగా వేడెక్కడం (గ్లోబల్‌ వార్మింగ్‌), ఇతర వాతావరణ పరిస్థితులు తదితర కారణాలతో కొన్నేళ్లకు భూమిపై కొన్ని ప్రాంతాల్లో సురక్షిత జీవనం సాధ్యం కాదన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మానవుడు వేరే గ్రహాలపైన తన ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా సంచలన విషయాన్ని వెల్లడించింది. 2030 లోపే మానవులు చంద్రుడిపై జీవించడానికి అవకాశం ఉందని సంతోషకరమైన విషయాన్ని చెవిన వేసింది.

ఆర్టెమిస్‌ రాకెట్‌ విజయవంతంగా ప్రయోగించాక ఈ దశాబ్ధం ముగిసేలోపు మానవులు చంద్రునిపై నివసించవచ్చని నాసా అధికారి ఒకరు తాజాగా తెలిపారు. ఈ క్రమంలో 2030కి ముందే మానవులు చంద్రునిపై చురుగ్గా పని చేసుకోవచ్చని చెప్పారు. మానవులకు సహాయం అందించడానికి రోవర్లు ఉంటాయని ఓరియన్‌ లూనార్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ ప్రోగ్రామ్‌ హెడ్‌ హోవార్డ్‌ హు వెల్లడించారు.

కాగా సాంకేతిక సమస్యలు, హరికేన్‌ తుపానులతో ఆర్టెమిస్‌ ప్రయోగం ఆలస్యమైందని తెలిపారు. ఈ మిషన్‌ విజయవంతమైతే తదుపరి ఆర్టెమిస్‌ 2, ఆర్టెమిస్‌ 3 ప్రయోగాలకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. ఈ రెండూ చంద్రుని మీద మనుషులు జీవించడానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయని నాసా అధికారి వివరించారు.

అలాగే భవిష్యత్తులో వ్యోమగాములు జీవించడానికి, చంద్రునిపై అంతరిక్ష కేంద్రం అయిన లూనార్‌ గేట్‌వే నిర్మాణానికి, అభివృద్ధికి ఆర్టెమిస్‌ తోడ్పడనుంది.

మరోవైపు ఓరియన్‌ క్యాప్సూల్‌ డిసెంబర్‌ 11న భూమిపైకి రానుంది. ఈ ప్రయోగం అమెరికాకు మాత్రమే కాకుండా యావత్‌ ప్రపంచం దీర్ఘకాలిక అంతరిక్ష అన్వేషణకు మొదటి అడుగు అని ఓరియన్‌ లూనార్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ ప్రోగ్రామ్‌ హెడ్‌ హోవార్డ్‌ హు అభివర్ణించడం విశేషం.

తొలిసారిగా 1969లో అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై కాలు మోపిన సంగతి తెలిసిందే. మళ్లీ 50 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటానికి నాసా శ్రీకారం చుడుతోంది. ఈసారి ఈ మూన్‌ మిషన్‌కు 'ఆర్టిమిస్‌ ప్రోగ్రామ్‌' అని నాసా నామకరణం చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.