Begin typing your search above and press return to search.

మమ్మల్ని చంపేసినా ఎవ్వరూ పట్టించుకోరేమో.!

By:  Tupaki Desk   |   21 Dec 2018 7:05 AM GMT
మమ్మల్ని చంపేసినా ఎవ్వరూ పట్టించుకోరేమో.!
X
బాలీవుడ్‌ లో నసీరుద్దీన్‌ షా గురించి తెలియని వారుండరు. వెడ్ నెస్‌ డే లాంటి సినిమాతో తన సత్తా ఏంటో చెప్పకనే చెప్పారు. సినిమాల్ని - దేశ రాజకీయాల్ని చాలా నిశితంగా పరిశీలించే షా.. రీసెంట్‌ గా దేశంలోని పరిస్థితులపై - రోజురోజుకి పెరుగిపోతున్న అసహనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒక పోలీసు అధికారి చావుకంటే.. గోవధే పెద్ద వార్తగా మారిందని అసహనం వ్యక్తం చేశారు. నసీరుద్ధీన్‌ షా కామెంట్స్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ట్విట్టర్‌ వేదికగా తీవ్ర పదజాలంతో ఆయన్ను ట్రోలింగ్‌ చేశారు.

రీసెంట్‌ గా ఉత్తరప్రదేశ్‌ లోని ఓ ఊరిలో గోవధ జరిగినందుకు అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఒక పోలీసు అధికారి - ఒక గ్రామస్థుడు చనిపోయారు. ఈ సంఘనటపై చాలా ఘాటుగా స్పందించారు నసీరుద్దీన్‌ షా. గోవుకి ఉన్న రక్షణ ఒక మనిషికి - పోలీసు అధికారికి లేదంటూ విమర్శించారు. “నా పిల్లల భద్రత గురించి చాలా ఆందోళనగా ఉంది. నా అదృష్టం బాగోలేక.. నేను - నా కుటుంబంతో బయటకు వెళ్తున్నప్పుడు.. రేపొద్దున్న ఎవరైనా దుండగుల గుంపు వచ్చి మా మతం ఏంటని అడిగితే నా భార్య రేఖ - నా పిల్లలు ఏ సమాధానం చెప్పాలి. చిన్నప్పటి నుంచి నేను నా పిల్లల్ని మతాలకు దూరంగా పెంచాను. ఇప్పుడు వారి భవిష్యత్‌ కు భరోసా ఎవరు” అంటూ ప్రశ్నించారు.

గతంలో చాలామంది సినిమా ప్రముఖులు.. దేశంలో పెరిగిపోతున్న అసహనంపై స్పందిచారు. రెండేళ్ల క్రితం ముంబైలో అసహనానికి అనుకూలంగా - వ్యతిరేకంగా ర్యాలీలు కూడా జరిగాయి. అయితే.. అప్పుడు నసీరుద్దీన్‌ షా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఆయన వ్యాఖ్యలు కాస్త ప్రాధాన్యం సంతరించుకున్నాయి.