Begin typing your search above and press return to search.

ఏపీలో మొక్కులు చెల్లించుకున్న జగన్ కొత్త దోస్త్

By:  Tupaki Desk   |   10 March 2020 10:20 AM GMT
ఏపీలో మొక్కులు చెల్లించుకున్న జగన్ కొత్త దోస్త్
X
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ వ్యక్తిగత విజ్ఞప్తి మేరకు పరిమల్‌ నత్వానీని ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. దీంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది. తనను ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు ఎంపిక చేయడంతో ఆయన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ‘ఏపీ ప్రజలకు ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేస్తాను’ అని ట్విటర్ లో పేర్కొన్నారు. ఆ వెంటనే ఆయన ఆంధ్రప్రదేశ్ లో వాలిపోయారు. రాజ్యసభ స్థానానికి ఎంపిక చేయడం తో ఆయన రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలను సందర్శించారు.

ముందుగా తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిని మంగళవారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. అనంతరం ఆ వెంటనే విజయవాడకు పయనమై ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తనకు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులకు నత్వానీ ధన్యవాదాలు తెలిపారు.

'ఏపీ నుంచి పెద్దల సభకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషం గా ఉంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం వల్లనే నన్ను మూడోసారి రాజ్యసభ కు వెళ్లే అరుదైన అవకాశం ఇచ్చారు. సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించిన తన వంతుగా ముందుండి పూర్తిచేస్తా. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులను తీసుకు రావడంలో సీఎం జగన్‌ చెప్పినట్లు పనిచేస్తూ సాధించుకుంటా. నాకున్న అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తా. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న వైఎస్‌ జగన్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషకర విషయం. పార్టీ ఎంపీలతో కలిసి టీమ్‌ వర్క్‌ చేస్తూ రాష్ట్రం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా' అని ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమల్ నత్వానీ ప్రస్తుతం జార్ఖండ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో రాజ్యసభ పదవీకాలం పూర్తి కానుండడంతో ఏపీ నుంచి పరిమల్‌ను రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని అంబానీ స్వయంగా వచ్చి సీఎం వైఎస్‌ జగన్‌ను కోరడంతో నత్వానీకి జగన్ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.