Begin typing your search above and press return to search.

గ‌రుడ పురాణం శివాజీకి ఎదురుదెబ్బ‌!

By:  Tupaki Desk   |   16 May 2019 10:11 AM GMT
గ‌రుడ పురాణం శివాజీకి ఎదురుదెబ్బ‌!
X
సినీ న‌టుడు క‌మ్ గ‌రుడ‌పురాణం సీరియ‌ల్ ను అదే ప‌నిగా చెప్పిన శివాజీకి సంబంధించిన విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లెన్నో ఉన్నాయి. ఆయ‌న ఎప్పుడు తెర మీద‌కు వ‌స్తారో.. ఎప్పుడు కనిపించ‌కుండా పోతార‌న్న విష‌యం అంత తేలిగ్గా అర్థం కాద‌ని చెబుతారు. టీవీ9 వ్య‌వ‌హారంలో ర‌విప్ర‌కాశ్ తో పాటు శివాజీ పేరు వినిపించ‌టం తెలిసిందే. త‌న‌కు దేవుడితో స‌మాన‌మ‌ని చెప్పే ర‌విప్ర‌కాశ్‌.. త‌న‌ను మోసం చేశాడ‌ని చెప్పే శివాజీ మాట‌లు సిత్రంగా వినిపిస్తుంటాయి. తాను ర‌విప్ర‌కాశ్ ద‌గ్గ‌ర టీవీ9 వాటాలు కొన్నాన‌ని.. వాటి షేర్ల‌ను త‌న‌కు బ‌ద‌లాయించ‌కుండా ఆయ‌న ఇబ్బంది పెడుతున్నార‌ని.. త‌మ డీల్ కు సంబంధించిన విష‌యాల్ని తెల్ల‌పేప‌ర్ మీద రాసుకున్న‌ట్లుగా చెబుతారు శివాజీ. ఆయ‌న చెప్పే మాట‌ల్లో క‌లిగే డౌట్లు అన్ని ఇన్ని కావు.

లీగ‌ల్ గా ఆయ‌న మాట‌లు చెల్లుబాటు కాకున్నా.. టీవీ9లో 90 శాతం షేర్ ను కొనుగోలు చేసిన అలంద మీడియా ఒప్పందాన్ని అమ‌లు చేయొద్ద‌ని కోరే డిమాండ్ లో లాజిక్ అస్స‌లు అర్థం కాదు. ర‌విప్ర‌కాశ్ కు.. శివాజీల మ‌ధ్య జ‌రిగిన వ్య‌క్తిగ‌త ఒప్పందానికి.. టీవీ9 కంపెనీకి లింకేమిటో ఎంత చించినా ఎవ‌రికి బుర్ర‌కు అర్థం కాని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా త‌న వాద‌న‌ను నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్ కు విన్న‌వించుకోగా.. ఆయ‌న వాద‌న‌ను కొట్టిపారేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. శివాజీ పిటిష‌న్ పై ప్ర‌స్తుతం ప్రొసీడింగ్స్ జ‌ర‌ప‌లేమ‌ని తేల్చింది.

టీవీ9 మాతృ సంస్థ ఏబీసీఎల్ లో జ‌రిగిన మార్పుల్ని త‌న‌కు తెలీకుండా ర‌విప్ర‌కాశ్ మోసం చేశార‌ని.. అందుకే ఇప్పుడు 90శాతం వాటా కొనుగోలు వ్య‌వహారాన్ని నిలిపివేస్తూ స్టే విధించాల‌ని కోరే ఆయ‌న తీరు చూస్తే.. బుద్ధి ఉన్న ప్ర‌తిఒక్క‌రికి అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి. అందుకేనేమో.. ఆయ‌న పిటిష‌న్ ను ప‌ట్టించుకోని నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్.. అలందా మీడియాకు అనుకూలంగా ఉత్త‌ర్వులు ఇచ్చేసింది. ఇదిలా ఉంటే.. ఎన్ సీఎల్ టీ వ‌ద్ద సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌తో పాటు..ఎస్ వోటీ పోలీసులు కూడా ఉన్నారు. అయితే.. ట్రిబ్యున‌ల్ ఎదుట ర‌విప్ర‌కాశ్‌.. శివాజీ త‌ర‌ఫు వాద‌న‌లు వినిపించ‌టానికి వారి లాయ‌ర్లు వ‌చ్చారే త‌ప్పించి..వారు రాలేదు. ఇప్ప‌టికే సైబ‌రాబాద్ పోలీసులు వీరిరువురికి నోటీసులు జారీ చేసి విచార‌ణ‌కు రావాల‌ని కోర‌టం.. వారిప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌క‌పోవ‌టం తెలిసిందే.