Begin typing your search above and press return to search.

కోర్టు సూటి ప్ర‌శ్న‌కు ఏం జ‌వాబిస్తారు బాబు?

By:  Tupaki Desk   |   17 March 2017 4:39 AM GMT
కోర్టు సూటి ప్ర‌శ్న‌కు ఏం జ‌వాబిస్తారు బాబు?
X
టీడీపీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని తెలుగుదేశం పార్టీ త‌న క‌ల‌ల రాజ‌ధాని అయిన అమ‌రావ‌తి గురించి ఆలోచ‌న‌లో ప‌డాల్సిన సంద‌ర్భ‌మిది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన పర్యావరణ అనుమతులను సవాల్‌ చేస్తూ నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ దాఖలైన పలు పటిషన్లను జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సంద‌ర్భంగా అన్న‌దాత‌ల ఆవేద‌న‌ల గురించి న్యాయ‌మూర్తి అడిగిన ప్ర‌శ్న‌లు నిజ‌మే క‌దా అనే భావ‌న‌ను క‌లిగిస్తాయి. వ్యవసాయ భూములు తీసుకుని, వాణిజ్య ప్లాట్లు ఇస్తే వాటిని రైతులు ఏమి చేసుకుంటారని న్యాయ‌స్థానం సందేహం వ్య‌క్తం చేసింది. భూములు అభివృద్ధి చేసి ఇచ్చేంతవరకు వారి జీవనాధారం ఎలా అని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ప్రశ్నించింది.

ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపిస్తూ శివరామకృష్ణన్‌ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు అమరావతిలో తగినంత భూమి లేకపోయినా, 33 వేల ఎకరాల భూ సేకరణ చేశామని తెలిపారు. ఈ క్రమంలో ధర్మాసనం కల్పించుకొని వ్యవసాయం మాత్రమే చేయగలిగే రైతుల నుంచి భూములను తీసుకొని వాణిజ్య ప్లాట్లు ఇస్తే వాళ్లు ఏం చేసుకుంటారని ప్రశ్నించింది. రైతుల నుంచి తీసుకున్న భూములను అభివృద్ధి చేసేందుకు పట్టే కాలంలో రైతుల బతుకుదెరువు ఎట్లా? వారికి నష్టపరిహారం ఏమైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించింది. భూములిచ్చిన రైతులకు పెన్షన్‌ - భూమి రకాన్ని బట్టీ ప్రతి ఏడాది కొంత మొత్తం చెల్లిస్తున్నామని గంగూలీ తెలిపారు. అనంతరం ప్రభుత్వం ఇచ్చే వాణిజ్య ప్లాట్లు పొందాక వాటిని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా రైతులు ఉపయోగించుకొని జీవనోపాధి పొందవచ్చునని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా పిటిషనర్‌ తరపు న్యాయవాది సంజయ్‌ పారిఖ్‌ జోక్యం చేసుకొని ''2013 భూ సేకరణ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరించలేదు. రైతులకు తగిన పునరావాసం - నష్ట పరిహారం కల్పించలేదు. ఇంకా కొంత మంది రైతులు భూములివ్వలేదు'' అని ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై గంగూలీ స్పందిస్తూ 2013 భూ సేకరణ చట్టం కంటే మెరుగైన ప్రయోజనాలను రైతులకు కల్పింస్తున్నామన్నారు. అనంతరం పారిఖ్‌ స్పందిస్తూ బహుళ పంటలు పండే భూములను ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిందని, దీంతో భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని వివరించారు. విజయవాడ-గుంటూరు ప్రాంతాలు కాలుష్య కోరాల్లో చిక్కుకున్నాయని, పవర్‌ ప్లాంట్లతో దీని పరిసర ప్రాంతాలు గ్యాస్‌ చాంబర్‌ లా మారాయని గతంలో వాదనల సందర్భంగా సంజయ్‌ పారిఖ్‌ ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ట్రిబ్యునల్‌ నూతన రాజధాని అమరావతిలో పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి వాహనాలను ఉపయోగిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీని కోసం అమరా వతిలో ఎలక్ట్రానిక్‌ బస్సులు - ఎంఎంటిఎస్‌ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నామని గంగూలీ తెలిపారు. అలా అయితే త్వరలో డీజిల్‌ వాహనాలను నిషేధిస్తామని ట్రిబ్యునల్‌ వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఏఫ్రిల్‌ 17కు వాయిదా వేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/