Begin typing your search above and press return to search.

అమరావతి నిర్మాణానికి అడ్డుపుల్ల

By:  Tupaki Desk   |   10 Oct 2015 11:14 AM GMT
అమరావతి నిర్మాణానికి అడ్డుపుల్ల
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఓవైపు భారీఎత్తున ఏర్పాట్లు జరిగిపోతుంటే మరోవైపు చేదువార్త వినిపించింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో అమరావతి నిర్మాణానికి చుక్కెదురైంది. రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పర్యావరణ అనుమతి లేనిదే ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని ఆదేశించింది. తడి భూములు, ముంపు ప్రాంతాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ... తదుపరి విచారణను నవంబర్‌ మొదటి వారానికి వాయిదా వేసింది. దీంతో దసరా రోజున శంకుస్థాపన చేయనున్నప్పటికీ అమరావతి పనులు వెంటనే మొదలుపెట్టే అవకాశం కనిపించడం లేదు.

అయితే.. త్వరలోనే పర్యావరణ అధికారుల నుంచి అనుమతులు వస్తాయని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. సోమ, మంగళవారాల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని చెబుతున్నారు.

కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన నేపథ్యంలో ఏపీ సర్కారు వడివడిగా అడుగులేస్తున్న సమయంలో గ్రీన్ ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు చంద్రబాబును చికాకుపెట్టాయి. ఈ నెల 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కార్యక్రమ షెడ్యూల్ కూడా ఖరారైంది.

శంకుస్థాపన పనులన్నీ ముమ్మరంగా జరుగుతుండగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏకంగా షాకిచ్చింది. తుళ్లూరు పరిధిలో జరుగుతున్న భూమి చదును పనులను నిలిపేయాలని ఆదేశించింది. గ్రీన్ కారిడార్‌ ను ఏర్పాటు చేయకుండానే ప్రభుత్వం పనులు మొదలుపెట్టిందని ఆరోపిస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో పిటిషన్ దాఖలు కావడంతో విచారణకు స్వీకరించి ఈమేరకు ఆదేశాలిచ్చింది.