Begin typing your search above and press return to search.
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు
By: Tupaki Desk | 20 Jan 2018 4:37 PM GMTకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ - ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇరకాటంలో పడేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ ఇద్దరిపై అభియోగాలు మోపుతూ కోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి...తాజాగా పటియాలా కోర్టు విచారణను ప్రారంభించిన నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ ఆదేశాలను సమర్పించారు. 2012లో రూ. 90.25 కోట్ల రుణాన్ని వడ్డీ లేకుండా నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ను నడుపుతున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంటూ పిటిషన్ దాఖలు చేసిన స్వామి ఆ వివరాలను అందించారు. రూ. 414 కోట్ల పన్నును కాంగ్రెస్ పార్టీ చెల్లించాలని కోర్టులో వాదించారు. దీంతో కేసు కీలక మలుపు తిరగనుంది.
భారత మొట్టమొదటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ 1938లో ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ ను 2008లో మూసివేశారు. ఈ క్రమంలో పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కేసు వేశారు. ఈ కేసులో పాటియాలా హౌస్ కోర్టు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. వారిద్దరే కాకుండా స్వయంగా విచారణకు హాజరుకావాలంటూ ఇందులో భాగస్వామ్యం అయిన పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా సమన్లు జారీ చేసింది. దీనిపై సోనియా, రాహుల్‌లు ఢిల్లీ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అయితే నిందితులకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నందున వారంతా విచారణకు హాజరుకావాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.
2010లో ఏజేఎల్‌ను యంగ్ ఇండియన్ (వైఐఎల్) టేకోవర్ చేసింది. వైఐఎల్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆమె కుమారుడికి చెరో 38 శాతం వాటా ఉంది. వీరిద్దరితోపాటు వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, శామ్ పిట్రోడా, సుమన్ దూబేలకు ఇందులో వాటాలున్నాయి.